
లండన్: జోఫ్రా అర్చర్.. ఇంగ్లాండ్ స్టార్ పేస్ బౌలర్. అన్ని ఫార్మట్లలోనూ రాణించే సామర్థ్యం ఉన్న వాడు. టెస్టుల్లో బ్యాట్స్‌మెన్లను ఎలా కట్డడి చేయగలడో..టీ20, వన్డే ఇంటర్నేషనల్స్‌లోనూ అంతే పొదుపుగా బౌలింగ్ చేయడంలో దిట్ట. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న జోఫ్రా అర్చర్ క్రికెట్‌కు దూరం అయ్యాడు.. ఇక ముందు కూడా దూరం కానున్నారు. కనీసం ఆరు నెలల పాటు అతను గ్రౌండ్‌లో కనిపించే అవకాశాలు లేవు. ఈ మధ్యలో భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్, ఐపీఎల్ 2021 ఫేస్ 2 మాత్రమే కాదు.. చివరికి టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో కూడా అతను ఆడే అవకాశాలు లేవు.
దీనికి కారణం- గాయం. గత ఏడాది దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడుతూ ఎల్బో గాయం కావడం వల్ల క్రికెట్ దూరం అయ్యాడు. ఇప్పటికే అతనికి ఓ సర్జరీ పూర్తయింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోన్నాడు. మరోసారి ఎల్బోక శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు జోఫ్రా అర్చర్. నిజానికి- తన సొంతదేశంలో భారత్‌ను ఎదుర్కొబోతోన్న ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో అతనికి స్థానం కల్పించింది బోర్డు. మూడో టెస్ట్ మ్యాచ్ నుంచి అతను ఆడొచ్చనే వార్తలు మొదట్లో వినిపించాయి. దీనికి అనుగుణంగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లు కూడా చేసింది. విశ్రాంతి ముగిసిన వెంటనే ఫిట్‌నెస్ పరీక్షలను నిర్వహించాలని భావించింది.
అందరి అంచనాలను తలకిందులు చేశాడు ఈ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్. గాయమైన ఎల్బోకు మరోసారి శస్త్రచికిత్స చేయించుకోవాలని భావిస్తోన్నాడు. కనీసం మరో ఆరునెలల పాటు అతను క్రికెట్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే ఐపీఎల్ 2021 ఫేస్ 2, ఆ వెంటనే అదే వేదికలపై సాగే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు జోఫ్రా అర్చర్ దూరం కావాలని నిర్ణయించుకున్నాడు. అతను మళ్లీ క్రికెట్‌లోకి ఎప్పుడు అడుగు పెడతాడనే విషయంపై ఇప్పటిదాకా స్పష్టత రాలేదు. అయినప్పటికీ ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మధ్య జరిగే యాషెస్ టెస్ట్ సిరీస్ నాటికి జట్టులో చేరుతాడనే ప్రచారం సాగుతోంది.