ఉప్పల్ వేదికగా రేపటి నుంచి టీమిండియాతో ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది. ఒకే ఒక్క పేసర్‌ను ఎంపిక చేసింది. ముగ్గురు స్పిన్నర్లను జట్టులోకి తీసుకుంది. ఉప్పల్ వికెట్ స్పిన్‌కు అనుకూలిస్తుందని భావించిన ఇంగ్లాండ్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఒకే ఒక్క ప్రధాన పేసర్‌తో ఇంగ్లాండ్ బరిలోకి దిగడం 62 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
ఇంగ్లాండ్ చివరిగా 1962లో ఒక్క ఫాస్ట్ బౌలర్‌తో టెస్టు ఆడింది. ఆ తర్వాత పేసర్లు బలాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటూ సుదీర్ఘ ఫార్మాట్‌లో తలపడుతోంది. అయితే తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్ జట్టులో జాక్ లీచ్‌తో పాటు యువ స్పిన్నర్లు రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్లీ ఉన్నారు. రెహాన్ అహ్మద్ ఒక్క టెస్టు మ్యాచ్ ఆడగా, టామ్ రేపటి మ్యాచ్‌తో అరంగేట్రం చేయనున్నాడు. గతేడాది పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెహాన్ ఏడు వికెట్లతో సత్తాచాటాడు.

అయితే ఫాస్ట్ బౌలర్‌గా మార్క్ వుడ్ మాత్రమే ఎంపిక అయ్యాడు. స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను కూడా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పక్కనపెట్టాడు. అండర్సన్, అట్కిన్సన్ కంటే మార్క్ బంతిని కాస్త ఎక్కువగా స్వింగ్ చేయగలడని భావించిన స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా, ముగ్గురు స్పిన్నర్లు వ్యూహం వెనుక ఆస్ట్రేలియా అనుభవం దాగి ఉన్నట్లు తెలుస్తోంది
ఆస్ట్రేలియా గత భారత పర్యటనలో స్పిన్ త్రయం వ్యూహాన్నే అనుసరించింది. మూడు టెస్టులకు ముగ్గురు స్పిన్నర్లను ఆసీస్ బరిలోకి దించింది. రెండో టెస్టులో కమిన్స్ ఒక్కడే పేసర్‌గా ఉన్నాడు. వారి ప్లాన్స్‌కు తగ్గట్టుగానే నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఒక్క విజయం సాధించి సంతృప్తి పడింది. ఆ నెగ్గిన మ్యాచ్‌లో 20 వికెట్లలో 18 వికెట్లు స్పిన్నర్లే తీసుకున్నారు. అయితే ఇంగ్లాండ్‌లో బెన్ స్టోక్స్ పేస్ బాధ్యతలను మోయగలడు. అలాగే జో రూట్ కూడా స్పిన్నర్‌గా రాణించగలడు. మరి, ఈ వ్యూహాలతో భారత్‌కు ఇంగ్లాండ్ పోటీ ఇస్తుందో లేదో చూడాలి!
ఇంగ్లాండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్ , రెహాన్ అహ్మద్, మార్క్ వుడ్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్
ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్, డాన్ లారెన్స్