
దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ సత్తాచాటలేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి తక్కువ పరుగులకే విండీస్ ఆలౌట్ అయింది. ఆదిల్ రషీద్ 4, మొయిన్ అలీ 2, టైమల్ మిల్స్ 2 ధాటికి విండీస్ ప్లేయర్స్ వరుసగా ఔటయ్యారు. 14.2 ఓవర్లలో 55 పరుగులకే పొల్లార్డ్ సేన ఆలౌట్ అయింది. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ చేసిన 13 పరుగులే విండీస్ జట్టులో టాప్ స్కోర్. 10 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితం అవ్వడం విశేషం. విండీస్ జట్టు అంతా హిట్టర్లను నమ్ముకుంటే.. నట్టేట ముంచేశారు. ఐపీఎల్ 2021లో అదరగొట్టిన విండీస్ ఆటగాళ్లు అసలు సమరంలో మాత్రం తేలిపోయారు.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్లు లెండిల్ సిమన్స్ (3), ఎవిన్ లావిస్ (6) మూడు ఓవర్లు ముగిసే సమయానికే పెవిలియన్‌కి చేరారు. అనంతరం వచ్చిన క్రిస్ గేల్ (13: 13 బంతుల్లో 3x4), శిమ్రాన్ హెట్‌మెయర్ (9: 9 బంతుల్లో 2x4) నిర్లక్ష్యంగా షాట్ ఆడేసి వికెట్ చేజార్చుకున్నారు. ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన డ్వేన్ బ్రావో (5)తో పాటు నికోలస్ పూరన్ (1), అంచనాలను అందుకోలేకపోయారు.
కెప్టెన్ కీరన్ పొలార్డ్ (6), ఆండ్రీ రసెల్ (0) కూడా ఇంగ్లండ్ బౌలర్ల దాటికి చేతులెత్తేశారు. ఆఖర్లో హొసెన్ (6 నాటౌట్: 13 బంతుల్లో) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోగా.. మెకాయ్ (0), రవి రాంపాల్ (3) అతనికి కనీస సహకారం కూడా అందించలేకపోయారు. 2016లో చివరిగా టీ20 వరల్డ్‌కప్ జరగగా.. ఆ టోర్నీ ఫైనల్లో ఇంగ్లాండ్‌పైనే వెస్టిండీస్ గెలిచిన విషయం తెలిసిందే. జట్టు నిండా పూర్తి హిట్టర్లు, తొలి మ్యాచ్ కావడంతో విండీస్ టీంపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఒక్కరు కూడా కీలక ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దాంతో మూల్యం చెల్లించుకోక తప్పదు.