ఇంగ్లండ్ పర్యటనను శ్రీలంక విజయంతో ముగించింది. ఓవల్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గి టెస్టు సిరీస్‌ను 1-2తో ముగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 325 పరుగులు చేసింది. కెప్టెన్ ఒలీ పోప్ (154) భారీ శతకం బాదాడు. మిలాన్ రత్నాయకే మూడు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ధనంజయ డిసిల్వా (69), కామిందు మెండిస్ (64) రాణించారు. జోష్ హల్, ఒలీ స్టోన్ చెరో మూడు వికెట్లు తీశారు. కాగా, 62 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 156 పరుగులకే కుప్పకూలింది. జేమి స్మిత్ (67) టాప్ స్కోరర్. లాహిరు కుమార నాలుగు వికెట్లు తీశాడు.

219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ నిస్సాంక (127 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. అయితే ఈ క్రమంలో లంక అరుదైన ఘనత సాధించింది. ఇంగ్లండ్ గడ్డపై 200+ టార్గెట్ ఛేదించిన తొలి ఆసియా జట్టుగా చరిత్రకెక్కింది. ఈ రికార్డు ఛేదనతో.. అంతకుముందు ఇంగ్లండ్‌లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని సాధించిన ఆసియా జట్లుగా ఉన్న పాకిస్థాన్, భారత్ రికార్డులను లంక బద్దలు కొట్టింది.
ఇంగ్లండ్‌లో పరుగుల పరంగా విజయవంతమైన లక్ష్యాన్ని సాధించిన ఆసియా దేశాల జాబితాలో శ్రీలంక (219/2) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్ (180/7- 2010లో), భారత్ (174/6- 1971లో), పాకిస్థాన్ (148/6- 2010లో) వరుసగా ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ గడ్డపై శ్రీలంకకు ఇది నాలుగో విజయం. ఓవల్ వేదికపై రెండోది. 1998లో ఓవల్, 2006లో నాటింగ్హమ్, 2014లో లీడ్స్, 2024లో ఓవల్ వేదికగా శ్రీలంక విజయాలు సాధించింది.
విజయంలో కీలక పాత్ర పోషించిన నిస్సాంక అరుదైన ఘనతలు సాధించాడు. టెస్టు ఫార్మాట్‌లో ఛేజింగ్‌లో బంతికో పరుగు లేదా తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిస్సాంక నిలిచాడు. ఈ జాబితాలో బెయిర్‌స్టో (136; 92 బంతుల్లో), నిస్సాంక (127*; 124 బంతుల్లో), జస్టిన్ లాంగర్ (122*; 122 బంతుల్లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.