
షార్జా: ఒమన్, యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2021లో ఇంగ్లండ్ జోరు కొనసాగుతోంది. షార్జా వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లీష్ జట్టు 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. 164 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో వాహిందు హసరంగ (34) టాప్ స్కోరర్. నిశాంక, పెరీరా, ఫెర్నాండో విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, అదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్ తలో వికెట్ తీశారు.
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే భారీ ఎదురు దెబ్బ తగిలింది. మొయిన్ అలీ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి పరుగు తీసే క్రమంలో ఓపెనర్ పతుమ్ నిశాంక (1) రనౌటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చరిత్ అసలంక (21: 16 బంతుల్లో 3x4, 1x6) వేగంగా ఆడాడు. ఈ క్రమంలోనే రషీద్ వేసిన నాలుగో ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మొయిన్ అలీకి చిక్కి పెవిలియన్ చేరాడు. ఇక ఆరో ఓవర్లో కుశాల్ పెరీరా (7).. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యే సరికి శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన అవిష్క ఫెర్నాండో (13), బనుక రాజపక్స నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. క్రీజులో కుదురుకుంటున్న సమయంలో ఈ జోడీని క్రిస్ జోర్డాన్ విడదీశాడు. తొమ్మిదో ఓవర్లో ఫెర్నాండోను జోర్డాన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కొద్ది సేపటికే రాజపక్స (26) కూడా ఔటయ్యాడు. దాంతో లంక కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ దసున్ శనక (26), వానిందు హసరంగ (34) దూకుడుగా ఆడుతూ జట్టును విజయం వైపు నడిపించారు. ఈ సమయంలో హసరంగ ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే శనక రనౌటయ్యాడు. దాంతో లంక ఓటమిపాలైంది. ఇంగ్లండ్ బౌలర్లలో మోయిన్ అలీ 3 ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. క్రిస్ వోక్స్ 2.3 ఓవర్లలో ఒక వికెట్ తీసి 25 పరుగులు ఇచ్చాడు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (101: 67 బంతుల్లో 6x6, 6x4) శతక్కొట్టాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (40: 36 బంతుల్లో 1x4, 3x6) రాణించాడు. జాసన్ రాయ్, డేవిడ్ మలన్, జానీ బైయిరిస్టో విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ మూడు, దుష్మంత చమీర ఒక వికెట్ తీశారు.