టీ20 ప్రపంచకప్ 2026లో ఇంగ్లండ్ జట్టు మరోసారి సత్తా చాటింది. పల్లెకెలె వేదికగా జరిగిన సూపర్-8 పోరులో పాకిస్థాన్‌ను 2 వికెట్ల తేడాతో చిత్తు చేసి, ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్న మొట్టమొదటి జట్టుగా అవతరించింది. ఒకానొక దశలో ఓటమి అంచున నిలిచినప్పటికీ.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ అసాధారణ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఇంగ్లండ్ జట్టు వరుసగా ఐదోసారి టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు అర్హత సాధించి తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంది.
తడబడిన పాక్ బ్యాటింగ్.. ఆదుకున్న ఫర్హాన్
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టుకు ఆరంభంలోనే గట్టి షాకులు తగిలాయి. ఓపెనర్ సైమ్ అయూబ్ (7), కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా (5) తక్కువ పరుగులకే వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం 24 బంతుల్లో 25 పరుగులు చేసి క్రీజులో పాతుకుపోయినట్లు కనిపించినా.. వేగంగా ఆడలేక వికెట్ పారేసుకున్నాడు. ఈ దశలో సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 63) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. చివర్లో షాదాబ్ ఖాన్ (11 బంతుల్లో 23) మెరుపులు మెరిపించడంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లతో పాక్ నడ్డి విరవగా.. ఆర్చర్, ఓవర్టన్ చెరో రెండు వికెట్లు తీశారు.

బ్రూక్ చారిత్రక సెంచరీ.. చెల్లాచెదురైన పాక్ బౌలింగ్:
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది చుక్కలు చూపించాడు. కేవలం 5 ఓవర్లకే 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ విశ్వరూపం ప్రదర్శించాడు. పాక్ బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో ఊచకోత కోస్తూ కేవలం 50 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇది మూడో అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. బ్రూక్ ఇన్నింగ్స్ ధాటికి పాక్ బౌలర్ల వ్యూహాలన్నీ తలకిందులయ్యాయి.
ఉత్కంఠభరిత ముగింపు.. పాక్ సెమీస్ ఆశలు గల్లంతు:
ఒకవైపు బ్రూక్ సెంచరీతో ఇంగ్లండ్ విజయం ఖాయమనుకున్న సమయంలో, షాహీన్ అఫ్రిది మళ్లీ పుంజుకుని వరుస వికెట్లు తీశాడు. దీంతో స్కోరు 161/8 వద్దకు చేరి మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే చివరి ఓవర్ తొలి బంతికే జోఫ్రా ఆర్చర్ బౌండరీ బాది ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ ఓటమితో పాకిస్థాన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. సూపర్-8 లో ఆడిన రెండు మ్యాచ్‌లలో ఆ జట్టుకు ఆశించిన ఫలితాలు రాకపోవడం, బాబర్ ఆజం స్ట్రైక్ రేట్ మళ్లీ వివాదాస్పదమవ్వడం పాక్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
హ్యారీ బ్రూక్ 'హరి'కేన్!
ఇంగ్లండ్ యువ సంచలనం, కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఒంటరి పోరాటం చేసిన బ్రూక్, అద్భుత శతకంతో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. పాక్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. మిగతా బ్యాటర్లు పాక్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తడబడుతుంటే, మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రూక్ మాత్రం చుక్కలు చూపించాడు. కేవలం 50 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి.
గేల్ రికార్డుకు చేరువగా..
ఈ మెరుపు శతకంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా బ్రూక్ రికార్డు సృష్టించాడు.2016లో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఇంగ్లండ్ జట్టుపై 47 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అదే క్రిస్ గేల్ 2007 దక్షిణాఫ్రికాపై 50 బంతుల్లోనే శతకం బాదాడు. క్రిస్ గేల్ అనంతరం హ్యారీ బ్రూక్ తాజాగా సెంచరీ బాదాడు.