ICC T20 ప్రపంచకప్‌లో భాగంగా సెమీస్ కోసం జరుగుతున్న పోరులో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు పవర్ ప్లే అంటే తొలి ఆరు ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయినప్పటికీ కూడా ఇన్నింగ్స్ ముగిసే సమయానికి డిఫెండ్ చేయగల స్కోరు సాధిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జట్టు కూడా తొలి ఆరు ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి కూడా మ్యాచ్ పై పట్టు సాధించి చివరకు విజయం సాధిస్తున్నాయి. మంగళవారం పాకిస్తాన్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ఇదే జరిగింది.ఇక పాకిస్తాన్ జట్టు పూర్తి స్థాయిలో విఫలమైంది.దీంతో పాక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.
T20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, బాబర్ ఆజంలు ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారని భావించినప్పటికీ అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశపరిచారు. శ్రీలంకలోని పల్లెకలే స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడిన పాకిస్థాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ బౌలర్ల దూకుడుకు పాకిస్థాన్ టాప్ ఆర్డర్ అతలాకుతలమైంది. ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోవడంతో కెప్టెన్ సల్మాన్, బాబర్ పై ఒత్తిడి పెరిగింది.


ఓపెనర్ సైమ్ అయూబ్ త్వరగా ఔటైన తర్వాత మూడో స్థానంలో క్రీజులోకి అడుగుపెట్టాడు కెప్టెన్ సల్మాన్ అలీ. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా, ఒక ఓవర్‌లో బౌండరీ బాది దూకుడు చూపించాడు. అయితే, లియామ్ డాసన్ స్పిన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి, లాంగ్-ఆఫ్‌లో జైమీ ఓవర్టన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కేవలం 6 బంతుల్లో 1 ఫోర్‌తో సహా 5 పరుగులు మాత్రమే చేసి ఔట్ కావడంతో పాకిస్థాన్ 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
నాలుగో స్థానంలో వచ్చిన బాబర్ ఆజం తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లతో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. మొదట సింగిల్స్ తీసుకుంటూ తరువాత ఒక ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి పాకిస్తాన్ పై ఉన్న ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేసాడు. ఇక, సింగిల్స్ తో కష్టమని భావించి దూకుడుగా వెళ్తున్నా టైంలో జైమీ ఓవర్టన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి, బాల్ మిస్ అవడంతో డైరెక్ట్ గా ఆఫ్-స్టంప్‌ను తగలడంతో (24 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు) పెవిలియన్ చేరాడు. తరువాతి స్థానంలో వచ్చినవారందరు పెద్దగా రాణించకపోవడంతో పాకిస్తాన్ 164 పరుగులకు 9 వికెట్లను కోల్పోయింది.

ఇక, సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఓపెనర్లు సాల్ట్, బట్లర్ వెంటవెంటనే ఔటయ్యారు. అప్పుడే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యారి బ్రూక్ పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేసాడు. ఆరంభంలో సింగిల్స్ తీసుకున్నా కాసేపు తర్వాత బౌండరీలతో రెచ్చిపోయాడు. ఒకపక్క వికెట్లు పడుతున్నా కెప్టెన్ ఆచితూచి ఆడటంతో ఇంగ్లండ్ గట్టెక్కింది. బ్రూక్ సెంచరీతో పాకిస్తాన్ పై 2వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్ లో స్థానం కైవసం చేసుకుంది.
అయితే, మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ అభిమానులు కెప్టెన్ సల్మాన్ అలీ, బాబర్ అజాంపై రెచ్చిపోయారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల పేలవమైన ప్రదర్శన వల్లే ఓడిపోయామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొందరైతే, బాబర్ అజాం దగ్గరుండి ఇంగ్లండ్ ను గెలిపించండని సెటైర్లు వేశారు