నాటౌట్‌గా వారిద్దరూ..
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. స్టువర్ట్ బ్రాడ్ సంధించిన తొలి ఓవర్ చివరి బంతికి టామ్ లాథమ్ అవుట్ అయ్యాడు. జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జట్టు స్కోర్ 35 పరుగుల వద్ద విల్ యంగ్ అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి వికెట్లు వరుస కట్టాయి. 62 పరుగుల వద్ద కేప్టెన్ కేన్ విలియమ్సన్, 83 పరుగుల వద్ద డెవాన్ కాన్వే, 123 పరుగుల వద్ద హెన్రీ నికోల్స్ వికెట్లు నేల కూలాయి.
ఫర్వాలేదనిపించిన కేన్..
కోవిడ్ బారిన పడి.. రెండో టెస్ట్‌కు దూరమైన కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. తొలి టెస్ట్ కంటే బెటర్ అనిపించుకున్నాడు. 64 బంతుల్లో అయిదు ఫోర్లతో 31 పరుగులు చేశాడు కేన్ విలియమ్సన్. క్రీజ్‌లో కుదురుకున్నాడనుకునే లోపే అవుట్ అయ్యాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విల్ యంగ్-20, డెవాన్ కాన్వే-26, హెన్రీ నికోల్స్-19 పరుగులు చేశారు.
వంద పరుగుల భాగస్వామ్యం..
ఇంగ్లాండ్ బౌలర్ల దూకుడుకు 123 పరుగుల వద్ద తెరపడింది. 124 పరుగుల వద్ద అయిదో వికెట్‌ను పడగొట్టిన తరువాత.. ఇక మరో బ్యాటర్‌ను పెవిలియన్ దారి పట్టించలేక చేతులెత్తేశారు. డారిల్ మిఛెల్-78, టామ్ బ్లండెల్ 45.. వారిని సమర్థవంతంగా అడ్డుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 102 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. దీనితో పటిష్ఠ స్థితికి చేరినట్టయింది న్యూజిలాండ్ ఇన్నింగ్. డారిల్ మిఛెల్-78, టామ్ బ్లండెల్ 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
హెన్రీ నికోల్స్ విచిత్రంగా అవుట్..
కాగా- హెన్రీ నికోల్స్ అవుట్ అయిన విధానం మాత్రం ఆసక్తి రేకెత్తింది. విచిత్రంగా అవుట్ అయ్యాడతను. జాక్ లీచ్ సంధించిన బంతిని స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు నికోల్స్. బలమైన షాట్ అది. ఖచ్చితంగా బుల్లెట్ వేగంతో బౌండరీని దాటి ఉండేదే. ఆ బంతి కాస్త నేరుగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న డారిల్ మిఛెల్ బ్యాట్‌ను తాకి.. గాల్లోకి లేచింది. మిడిల్ ఆఫ్ ది బ్యాట్‌ను తగలడంతో మిడాఫ్ దిశగా దూసుకెళ్లింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న లీ.. దాన్ని అందుకున్నాడు.
ఏం జరుగుతోందో..
దీనితో హెన్రీ నికోల్స్ నిరాశగా వెనుదిరిగాడు. ఈ అవుట్ పట్ల బౌలర్ జాక్ లీచ్ కూడా కొంత సేపు అయోమయానికి గురయ్యాడు. హెన్రీ నికోల్స్ ఎలా అవుట్ అయ్యాడో అతనికి కూడా అర్థం కాలేదు. జరిగిందేంటో అర్థం చేసుకోవడానికి ఇంగ్లాండ్ ఫీల్డర్లు, హెన్రీ నికోల్స్, డారిల్ మిఛెల్‌కు కూడా కొంత సమయం పట్టింది. దీన్ని అవుట్‌గా అంపైర్ ప్రకటించడంతో నికోల్స్ పెవిలియన్ దారి పట్టక తప్పలేదు. ఇదివరకు ఇలాంటి అవుట్ ఎక్కడా నమోదు కాలేదు.
ఆసీస్-శ్రీలంక మ్యాచ్‌లోనూ..
గతంలో ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరిగిన వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లో ఆండ్రూ సిమండ్స్ దాదాపుగా ఇదే తరహాలో అవుట్ అయ్యాడు. ఆండ్రూ సిమండ్స్ కొట్టిన షాట్‌కు బంతి నేరుగా వెళ్లి నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న మైఖెల్ క్లార్క్ కాలిని తాకి గాల్లోకి లేచింది. మిడ్ ఆఫ్‌లో ఉన్న ఫీల్డర్ దాన్ని అందుకున్నాడు. సిమండ్స్ చిరునవ్వుతో వెనుదిరిగాడు. హెన్రీ నికొల్స్ కొట్టిన షాట్‌కు బంతి నాన్ స్ట్రైకర్ బ్యాట్‌ను తాకి ఫీల్డర్ వైపునకు దూసుకెళ్లింది.


Click it and Unblock the Notifications












