
లండన్: ఇంకొద్ది రోజుల్లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. బర్మింగ్ హామ్ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ మ్యాచ్ కోసం లీసెస్టర్‌షైర్‌లో భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే పర్యవేక్షణలో టీమిండియా ప్లేయర్లు నెట్స్‌లో చెమటోడుస్తోన్నారు. కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా జట్టు ప్లేయర్లందరూ నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నారు.
మరోవంక.. ప్రత్యర్థి జట్టు ఇంగ్లాండ్ కూడా ప్రాక్టీస్‌లో బిజీగా ఉంటోంది. భారత్ కంటే ముందు న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది ఇంగ్లాండ్‌కు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌లో తలపడాల్సి ఉంది. గురువారం హెడింగ్లేలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. దీని కోసం ఇంగ్లాండ్ జట్టు కసరత్తు సాగిస్తోంది.
కాగా- బెన్ స్టోక్స్ నెట్ ప్రాక్టీస్‌కు దూరం అయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడతను. దగ్గుతో బాధపడుతున్నాడు. స్టోక్స్‌కు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అయినప్పటికీ- అనారోగ్యం బారిన పడ్డాడు. దీనితో నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొనట్లేదు. హెడింగ్లే టెస్ట్ మ్యాచ్ మొదలు కావడానికి ఒక్కరోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం ఇంగ్లాండ్ క్యాంప్‌ను ఆందోళనకు గురి చేసింది.
ఇప్పటికే బ్యాటింగ్ కోచ్ మార్కస్ ట్రెస్కొథెక్ కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. స్టోక్స్ కూడా కోవిడ్ బారిన పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ దీన్ని కొట్టి వేసింది. అతనికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తెలిపింది. దగ్గు తగ్గట్లేదని, మరో 24 గంటల పాటు అతను డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటాడని స్పష్టం చేసింది. కాగా- బెన్ స్టోక్స్ అస్వస్థతకు గురి కావడం అటు భారత్‌కు కలిసొస్తుందా? అనే అభిప్రాయాలు సైతం ఉన్నాయి.
జులై 1వ తేదీన ఆరంభం కానున్న టెస్ట్ మ్యాచ్ వరకు అతని ఆరోగ్యం కుదుటపడుతుందనీ ఈసీబీ ఆశిస్తోంది. కాగా- బెన్ స్టోక్స్ అందుబాటులో లేకపోతే.. మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు పగ్గాలు మరో ప్లేయర్‌కు అందజేయాల్సి ఉంటుంది. హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ పరిశీలనలో ముగ్గురి పేర్లు ఉన్నాయి. ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, జానీ బెయిర్‌స్టో లేదా జో రూట్‌కు కేప్టెన్సీ పగ్గాలను అప్పగించే అవకాశాలు ఉన్నట్లు బ్రిటన్ మీడియా అంచనా వేసింది. ఇప్పటికే సిరీస్‌ను గెలిచిన నేపథ్యంలో మూడో టెస్ట్ కోసం స్టార్ పేసర్ అండర్సన్‌కు విశ్రాంతి ఇచ్చింది ఈసీబీ.