ENG vs NEP: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుకు నేపాల్ చుక్కలు చూపించింది. పసికూన నేపాల్ అద్భుత పోరాట పటిమను కనబరిచినప్పటికీ.. చివరి బంతి వరకు సాగిన ఈ ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ కేవలం 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. సామ్ కరన్ ఆఖరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్‌ను పరాభవం నుంచి కాపాడారు.
తడబడిన ఇంగ్లాండ్.. ఆదుకున్న బెథెల్, బ్రూక్
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టుకు ఆరంభంలోనే నేపాల్ బౌలర్లు షాకిచ్చారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (1) త్వరగానే ఔట్ కాగా.. కెప్టెన్ జోస్ బట్లర్ (26) కాసేపు మెరిసి వెనుదిరిగాడు. 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్‌ను జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్ ఆదుకున్నారు. బెథెల్ (55 పరుగులు, 35 బంతుల్లో), హ్యారీ బ్రూక్ (53 పరుగులు, 32 బంతుల్లో) అర్థ సెంచరీలతో రాణించారు. చివర్లో విల్ జాక్స్ కేవలం 18 బంతుల్లో 39 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగలిగింది.

నేపాల్ ధీటైన సమాధానం.. దిపేంద్ర సింగ్ మెరుపులు
అనంతరం 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ ఏమాత్రం బెదరలేదు. ఓపెనర్ కుశాల్ భుర్తెల్ (29) జోఫ్రా ఆర్చర్ ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు బాది ఇంగ్లాండ్‌కు హెచ్చరికలు పంపాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ పౌడెల్ (39), దిపేంద్ర సింగ్ ఐరీ (44 పరుగులు, 29 బంతుల్లో) ఇంగ్లాండ్ స్పిన్నర్లను ఉతికి ఆరేశారు. అదిల్ రషీద్ వేసిన ఒకే ఓవర్‌లో 19 పరుగులు రావడంతో వాంఖడే మైదానం నేపాల్ అభిమానుల కేకలతో మారుమోగిపోయింది.
ఆఖరి ఓవర్ డ్రామా.. కాపాడిన సామ్ కరన్
చివరి 3 ఓవర్లలో నేపాల్ విజయానికి 38 పరుగులు అవసరమైన దశలో లోకేష్ బామ్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో సమీకరణం చివరి ఓవర్‌లో 10 పరుగులకు చేరుకుంది. సామ్ కరన్ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి ఐదు బంతులు చాలా కట్టుదిట్టంగా పడ్డాయి. చివరి బంతికి 6 పరుగులు అవసరమైన సమయంలో లోకేష్ బామ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే తీయగలిగాడు. ఫలితంగా నేపాల్ 180 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో అతికష్టం మీద విజయాన్ని అందుకుంది.