
లీడ్స్: భారత్ 1971లో ఇంగ్లండ్‌పై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచినప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలదనే నమ్మకం కలిగిందని టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఆ చారిత్రక ఘట్టం జరిగి నేటికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నాటి మ్యాచ్ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ ఆ రోజుల్లో తాను రేడియోలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని విన్నానని చెప్పాడు. ప్రస్తుతం రవిశాస్త్రి ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. లార్డ్స్ విజయంతో ఆయన ఆనందంలో తెలియాడుతున్నాడు.
తాజాగా రవిశాస్త్రి మాట్లాడుతూ... 'నేనప్పుడు తొమ్మిదేళ్ల కుర్రాడిగా ఉన్నా. ఆ మ్యాచ్ ఎలా సాగిందో నాకింకా గుర్తుంది. ప్రతి బంతిని నేను రేడియో కామెంట్రీలో విన్నా. అప్పుడు ఫరూక్ ఇంజినీర్, గుండప్ప విశ్వనాథ్, అజిత్ వాడేకర్ తమవంతు పరుగులు చేశారు. అప్పుడు భారత్ సిరీస్ గెలవడం సంచలనంగా మారింది. దాంతో విదేశాల్లో ఎక్కడైనా గెలుస్తామనే ధీమా కలిగించింది. ఇక ఇంగ్లండ్‌లో గెలవడం అనేది చారిత్రక ఘట్టం. ఇది జరిగి అప్పుడే 50 ఏళ్లు గడిచాయి. నాటి క్రికెటర్లు ఒక ఒరవడి సృష్టించారు. వాళ్లందరికీ హ్యాట్సాఫ్' అంటూ శాస్త్రి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.
1971లో అజిత్ వాడేకర్ సారథ్యంలోని భారత జట్టు మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టు, ఓల్డ్ ట్రాఫర్డ్‌లో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిశాయి. ఇక ఓవల్‌లో జరిగిన మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులు చేసింది. ఓపెనర్ జాన్ జేమ్సన్ (82), అలాన్ నాట్ (90), రిచర్డ్ హ్యూటన్ (81) రాణించారు. ఆపై భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు విఫలమైనా అజిత్ వాడేకర్ (48), దిలీప్ సర్దేసాయి (54), ఫరూక్ ఇంజినీర్ (59), ఏక్‌నాథ్ సోల్కర్ (44) పరుగులు చేశారు.
అనంతరం 71 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు టీమిండియా లెగ్ స్పిన్నర్ బి చంద్రశేఖర్ చుక్కులు చూపించాడు. తన లెగ్‌స్పిన్ మ్యాజిక్‌తో 6 వికెట్లతో సత్తా చాటిన చంద్రశేఖర్ దెబ్బకు 101 పరుగులకు ఆలౌట్ అయింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సునీల్ గావస్కర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే కెప్టెన్ వాడేకర్ 45 నాటౌట్, దిలీప్ సర్దేశాయ్ 40 పరుగులతో రాణించడంతో టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై తొలి విజయంతో పాటు టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. అంతేకాదు 26 టెస్టు వరుస టెస్టు విజయాలతో జోరు మీదున్న ఇంగ్లండ్ జట్టుకు అడ్డుకట్ట వేసింది. 1932 నుంచి చూసుకుంటే విదేశాల్లో భారత్‌కు ఇది రెండో టెస్టు సిరీస్ విజయం. అంతకముందు 1971లోనే వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత్ జట్టు ఇంగ్లండ్ గడ్డపై ఉంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య బుధవారం నుంచి హెడింగ్లీ లీడ్స్ వేదికగా మూడో టెస్టు ఆరంభం కానుంది. ఇప్పటికే క్రికెట్ పుట్టినిళ్లు లార్డ్స్‌లో ఘన విజయం సాధించిన భారత్.. లీడ్స్ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌లో దూసుకుపోవాలని చూస్తోంది. మరోవైపు రెండో టెస్టులో అధికభాగం ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లండ్.. చివరిరోజు ఊహించని రీతిలో ఓటమిపాలైంది. దాంతో మూడో టెస్టులోనైనా టీమిండియాను ఓడించి సిరీస్ సమం చేయాలని రూట్ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మరో ఆసక్తికర పోరు అభిమానులను అలరించనుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు టాస్ పడనుంది. ఇక 3.30కి హెడింగ్లీ మైదానంలో మ్యాచ్ ఆరంభం కానుంది.