
అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచులో బంగ్లాదేశ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది. దాంతో ఇంగ్లండ్ ముందు 125 పరుగుల స్వల్ప లక్ష్యంను మాత్రమే ఉంచగలిగింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో ముష్పికర్ రహీమ్ చేసిన 29 పరుగులే అత్యధికం. రహీం 30 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. మహ్మద్ నయీం (5), లిట్టన్ దాస్ (9), షకీబుల్ హసన్ (4) పూర్తిగా విఫలమయ్యారు. ఇన్నింగ్స్ చివరలో నాసుమ్ అహ్మద్ (19), నూరుల్ హసన్ (16) ఆదుకోకుంటే బంగ్లా ఆ మాత్రం స్కోర్ కూడా చేసేదికాదు. ఇంగ్లండ్ బౌలర్లలో టైమల్ మిల్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు పడగొట్టాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్లు మహ్మద్ నయీం (5), లిట్టన్ దాస్ (9)ను మొయీన్ అలీ పెవిలియన్ చేర్చాడు. ఇద్దరు క్యాచ్ ఔట్ అయ్యారు. ఆరో ఓవర్లో షకీబుల్ హసన్ (4)ను క్రిస్ వోక్స్ బోల్తాకొట్టించాడు. రషీద్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో షకీబ్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపు ముష్ఫికర్ రహీమ్ (39), మహ్మదుల్లా (19) క్రీజులో నిలబడ్డారు. దాంతో బంగ్లా స్కోర్ బోర్డు కాస్త ముందుకు కదిలింది.
అయితే ముష్ఫికర్ రహీమ్ అవుట్ అయిన తర్వాత బంగ్లాదేశ్ పరిస్థితి పూర్తిగా దిగజారింది. మహ్మదుల్లాతో సమన్వయలోపంతో ఆతిఫ్ హుస్సేన్ (5) రనౌట్ అయ్యాడు. నురుల్ హసన్ (16), మెహెదీ హసన్ (11) కూడా నిరాశపరిచారు. ఇక చివర్లో నాసుమ్ అహ్మద్ (9 బంతుల్లో 19) రెండు సిక్సర్లు కొట్టాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఆఖరి రెండు బంతులకు బంగ్లా జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. అహ్మద్, హసన్ ఆదుకోకుంటే బంగ్లా ఆ మాత్రం స్కోర్ కూడా చేసేదికాదు. ఇంగ్లండ్ బౌలర్లలో టైమల్ మిల్స్ 3 వికెట్లు పడగొట్టాడు. మొయీన్ అలీ 2, లియామ్ లివింగ్‌స్టన్ 2 వికెట్లు కూల్చగా.. క్రిస్ వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. పొట్టి ఫార్మట్ మ్యాచ్‌లల్లో ఇప్పటిదాకా బంగ్లాదేశ్, ఇంగ్లండ్ రెండు జట్లు ఎప్పుడూ ఎదురు పడలేదు. ఈ రెండు జట్ల మధ్య తొలిసారిగా టీ20 మ్యాచ్ జరుగుతుంది. దీనికి టీ20 ప్రపంచకప్ మెగా ఈవెంట్ వేదిక కావడం ఆసక్తిగా మారింది. రెండు దశాబ్దాలుగా బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు టెస్టు, వన్డే ఫార్మాట్లలో మాత్రమే పోటీ పడుతున్నాయి. ఎట్టకేలకు ఈరోజు టీ20 మ్యాచుకు ముహూర్తం కుదిరింది. మరి క్రికెట్ చరిత్రలో తొలిసారి ఈ రెండు జట్లు తలపడే ఈ మ్యాచ్‌లో విజేతగా ఎవరు నిలుస్తారో మరి.