అంతర్జాతీయ క్రికెట్‌లో ఇద్దరి లెజెండ్ క్రికెటర్ల శకం ముగిసింది. అత్యుత్తమ కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా అభిమానలచే కీర్తి ప్రతిష్టతలను అందుకున్న ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆదివారం ఆస్టేలియా కెప్టెన్ మైఖెల్ క్లార్క్, సోమవారం శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర.
అయితే చివరి టెస్టులో కెప్టెన్ మైఖెల్ క్లార్క్ విజయంతో నిష్క్రమించగా, సంగక్కర మాత్రం పరాజయంతో నిష్క్రమించాల్సి వచ్చింది. ఇద్దరూ తమ తమ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను సాధించారు. చివరి మ్యాచ్‌లో ఈ దిగ్గజాలకు ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు 'గార్డ్ ఆఫ్ హానర్ 'తో స్వాగతం పలికారు.
38ఏళ్ల కుమార సంగక్కర సుమారు 15ఏళ్లు పాటు శ్రీలంక క్రికెట్‌కు వెన్నుముకగా నిలిచాడు. కెరీర్‌లో 134 టెస్టులాడిన సంగక్కర 12,400 పరుగులు చేశాడు. ఇందులో 38 సెంచరీలు, 52 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇంకో విశేషమేమిటంటే 38 సెంచరీల్లో 11 డబుల్ సెంచరీలు ఉండటం.
404 వన్డే మ్యాచ్‌లాడి 14,234 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 93 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన అటగాళ్లలో ఐదో స్ధానంలో ఉన్నాడు. 15,921 పరుగులతో సచిన్ టెండూల్కర్ మొదటి స్ధానంలో ఉన్నాడు.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సుదీర్ఘకాలంపాటు నంబర్‌వన్‌గా కొనసాగాడు. మహేళ జయవర్ధనేతో కలిసి ఎన్నో రికార్డు భాగస్వామ్యాలు కూడా నెలకొల్పాడు. తన కెరీర్‌లో ఒక టి20 ప్రపంచకప్ గెలిచాడు. వన్డేల నుంచి తప్పుకునే ముందు చివరి ఐదు ఇన్నింగ్స్‌లో ఏకంగా నాలుగు సెంచరీలు సాధించాడు.
ఇక మైఖెల్ క్లార్క్ విషయానికి వస్తే 12 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా జట్టుకు సేవలందించాడు. 34 ఏళ్ల మైఖెల్ క్లార్క్ 115 టెస్టుల్లో 8643 పరుగులు సాధించాడు. ఇందులో 28 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 329 (నాటౌట్).
ఇక 245 వన్డేలాడిన మైఖెల్ క్లార్క్ 7981 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 58 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మైఖెల్ క్లార్క్ తన కెరీర్‌లో రెండు ప్రపంచ కప్‌లు, రెండు యాషెస్ సిరిస్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. రికీ పాంటింగ్ తర్వాత ఆస్టేలియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన క్లార్క్ 2015లో సొంత గడ్డపై వరల్డ్ కప్‌ను అందుకున్నాడు.