న్యూఢిల్లీ: ఆదివారం ఉదయం యూరీలో జరిగిన ఉగ్రదాడిపై టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి తన సంతాపాన్ని తెలిపాడు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 17 మంది జవానుల కుటుంబాలకు కోహ్లీ ట్విట్టర్ ద్వారా తన సానుభూతిని తెలియజేశాడు.
'ఉగ్ర దాడిని ఖండిస్తున్నా.. ఈ ఫొటో చూశాక నాలో కలిగిన భావోద్వేగాలను మాటల్లో వివరించలేకుండా ఉన్నా.. జైహింద్' అని ఆవేదన వ్యక్తం చేశాడు. దాడికి సంబంధించిన ఒక ఫొటోను కోహ్లీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
కాగా, కోహ్లీ సెప్టెంబరు 22నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు మ్యాచులకు సారథ్యం వహించనున్నాడు.

భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. కోహ్లీ కంటే ముందే ఉగ్రదాడి ఘటనపై స్పందించాడు. ఉగ్రదాడి వార్త వినగానే తన గుండె పగిలిందన్నాడు. దాడి చేసిన వాళ్లు రెబల్స్ కాదని ఉగ్రవాదులేనని సెహ్వాగ్ అన్నాడు.
అయితే ఉగ్రవాదానికి తప్పకుండా సరైన సమాధానం చెప్పాల్సిందేనని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. కాగా, మనం సంయమనం పాటిస్తుంటే పాకిస్తాన్ రోతను ప్రదర్శిస్తోందని భారత ఆటగాడు గౌతమ్ గంభీర్ అన్నారు. మనం పరిష్కారానికి ముందుకొస్తుంటే పాక్ బుల్లెట్లతో సమాధానం ఇస్తోందని మండిపడ్డారు.