దిగ్గజ క్రికెట్ సచిన్ టెండూల్కర్ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడు సాధించిన పరుగులు, చేసిన శతకాలు ఇప్పటికీ టాప్‌లోనే ఉన్నాయి. సచిన్ సాధించిన శతక శతకాల రికార్డుకు దగ్గర్లో విరాట్ కోహ్లి మినహా ఏ ప్లేయర్ లేడు. అయితే ఈ స్థాయిలో తాను ఉండటానికి కారణం తన తండ్రి అని సచిన్ టెండూల్కర్ అన్నాడు. సచిన్ తండ్రి రమేశ్ టెండూల్కర్ బర్త్‌డే ఈ రోజు. ఈ సందర్భంగా సచిన్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
'' నాన్న ఎప్పుడూ శ్రద్ధగా ఉంటాడు, కానీ కఠినంగా ఉండేవాడు కాదు. నా లైఫ్‌లో ఏం చేయాలనుకుంటున్నానో దానిని ఎంచుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. నా కలలు అందుకోవడానికి పూర్తి మద్దతు ఇచ్చాడు.పిల్లలకు ప్రేమ, స్వేచ్ఛను ఇస్తూ తను పెంచిన విధానం పేరెంటింగ్‌లో గొప్ప పాఠం. ఆయన ఆలోచనలు కాలం కంటే ముందు ఉంటాయి. ఆయనను అంతగా ప్రేమించడానికి మిలియన్ కారణాల్లో ఇది ఒకటి. ఇప్పుడు ఈ స్థితిలో నేను ఉన్నానంటే దానికి కారణం ఆయనే. హ్యాపీ బర్త్ డే బాబా, మిమ్మల్ని ప్రతి రోజు మిస్ అవుతున్నా'' అని సచిన్ ట్వీట్ చేశాడు.

అయితే సచిన్ జీవితంలో ఈ రోజు మరో ప్రత్యేకత ఉంది. సరిగ్గా 34 ఏళ్ల క్రితం ఇదే రోజున వన్డేల్లో సచిన్ అరంగేట్రం చేశాడు. 1989 డిసెంబర్ 18న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచే సచిన్‌కు తొలి వన్డే.అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. 16 ఓవర్ల పాటే జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ భారత్‌కు 88 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఛేదనలో టీమిండియా 80 పరుగులే చేసింది.అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సచిన్ రెండు బంతులు ఎదుర్కొని డకౌటయ్యాడు.
కాగా, 2013లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సచిన్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే మెంటార్ బాధ్యతల నుంచి సచిన్ వైదొలిగినట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. ఇటీవల రోహిత్ శర్మను కాదని ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.