
ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఆ మార్పు అనేది- యంగ్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్ సారథ్యంలో ఇప్పుడిప్పుడే గాడిన పడుతోన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టును మరింత మెరుగుపర్చేలా, పరుగులు పెట్టించేలా కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఇంకో నెలన్నర రోజుల్లో ప్రారంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పగ్గాలు లెజెండరీ బ్యాట్స్‌మెన్ చేతుల్లోకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
దీనికోసం ఏకంగా ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ రంగంలోకి దిగారు. తన మాజీ సహచరుడు రమీజ్ రాజాను క్రికెట్ బోర్డు సారథిగా నియమించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన వెలువడింది. ఇప్పటిదకా పీసీబీ ఛైర్మన్‌గా పనిచేసిన ఎహ్‌సాన్ మని స్థానంలో రమీజ్ రజా నియమితులయ్యారు. ఎహ్‌సాన్ మని పదవీకాలం ముగిసిన వెంటనే- పీసీబీ ఛైర్మన్‌గా రమీజ్ రాజా బాధ్యతలను స్వీకరిస్తారు. పలు అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడిన రమీజ్ రాజా నేతృత్వంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఏ స్థాయిలో రాణిస్తుందనేది ఆసక్తి కలిగించే అంశం.
రమీజ్ రాజా, ఎహ్‌సాన్ మని.. ఈ నెల 23వ తేదీన ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను కలిశారు. ఆయనతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అప్పుడే.. రమీజ్ రాజాకు పీసీబీ ఛైర్మన్ పదవి దక్కుతుందనే వార్తలు వెలువడ్డాయి. ఇక తాజాగా ఆదేశాలు కూడా వెలువడ్డాయి. పాకిస్తాన్ జాతీయ జట్టుకు పూర్వవైభవాన్ని తీసుకుని రావాలనే ఏకైక లక్ష్యంతో ఇమ్రాన్ ఖాన్.. తన మాజీ సహచరుడికి బోర్డు పగ్గాలను అందజేసినట్లు చెబుతున్నారు.

రమీజ్ రాజా మాజీ క్రికెటర్. జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. 1984 నుంచి 1997 మధ్య కాలంలో అతను జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహించాడు. 57 టెస్టుల్లో 2833 పరుగులు.. 198 వన్డేల్లో 5851 పరుగులు చేశాడు. 1992 ప్రపంచకప్ గెలిచిన పాక్ జట్టులో సభ్యుడు. ఇప్పటిదాకా పాకిస్తాన్ ఒకే ఒక్కసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు ఇమ్రాన్ ఖాన్ కేప్టెన్‌గా వ్యవహరించాడు. 1992లో ఇమ్రాన్ ఖాన్ కేప్టెన్సీలో ఆ దేశ జట్టు ప్రపంచకప్ గెలిచింది.
ఇప్పుడు తాజాగా అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. దీనికోసం క్రికెట్ ఆడే అన్ని దేశాలు కూడా సమాయాత్తమౌతోన్నాయి. పాకిస్తాన్ కూడా వరుస సిరీస్‌లను ఆడుతోంది. ఇదివరకు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లొచ్చిందా టీమ్. అనంతరం వెస్టిండీస్ పర్యటననూ ముగించుకుంది. రెండు టెస్టుల సిరీస్‌ను సమం చేసుకుంది. తొలి టెస్ట్ మ్యాచ్ కోల్పోయినప్పటికీ.. రెండో టెస్ట్‌లో జెండా ఎగరేసింది. సిరీస్ సమం చేసింది.