
హైదరాబాద్: టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినా ఎలాంటి ఒత్తిడికి గురికాదని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆశిష్ నెహ్రా అన్నాడు. నెహ్రా ప్రస్తుతం భారత్-శ్రీలంక జట్ల మధ్య కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్టుకు కామెంటేటర్‌గా వ్వవహారిస్తున్నాడు.
శ్రీలంకతో టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌ల అనంతరం టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో నెహ్రా మాట్లాడుతూ 'దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే కోహ్లీసేనకు ఈడెన్ వికెట్ ఓ మంచి తయారీ. ఈ వికెట్ కోహ్లీ సేనకు ఓ పరీక్ష లాంటిది' అని నెహ్రా పేర్కొన్నాడు.
'టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినా ఎలాంటి ఒత్తిడికి గురికాదని నేను భావిస్తున్నాను. డేల్ స్టెయిన్, రబడతో వారి బౌలింగ్ పటిష్టంగా ఉంటే వారిని ఎదుర్కొనేందుకు మనకు కోహ్లీ ఉండనే ఉన్నాడు కదా. దూకుడుగా ఆడేందుకు అతను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు' అని నెహ్రా తెలిపాడు.
ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేస్తాడని నెహ్రా ఆశాభావం వ్యక్తం చేశాడు. 'దక్షిణాఫ్రికాపై షమి రాణించగలడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత బౌలర్లకు ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎంతో నేర్పుతోంది. దక్షిణాఫ్రికాలో పిచ్‌లు ఎలా ఉంటాయో దీన్ని అలాగే తయారు చేశారు. ఇది మనకు కలిసొచ్చే అంశం' అని నెహ్రా తెలిపాడు.
'ఇదొక మంచి వికెట్. దక్షిణాఫ్రికా పర్యటనకు ఇదొక మంచి సన్నాహాకం. భారత్ తక్కువ స్కోరు చేసిన భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రీలంక బ్యాటింగ్ చేసినా ఈ పిచ్‌పై 200-220 పరుగులు మాత్రమే చేయగలుగుతుంది' అని నెహ్రా అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.