
ఐపీఎల్ తరహాలో టీ20 లీగ్
టీ20 లీగ్‌ను సొంతంగా ప్రారంభిస్తున్నట్లు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. మొదటి సీజన్ డిసెంబర్ 2021 నుంచి జనవరి 2022 మధ్య జరుగుతుందని సమాచారం. లీగ్ ప్రారంభించేందుకు యూఏఈ ప్రభుత్వంలోని శక్తిమంతమైన మంత్రి, ఈసీబీ చైర్మన్ అయిన షేక్ నహాయన్ మబారక్ అల్ నహాయన్ సహాయసహకారాలు ఉన్నట్టు తెలుస్తోంది. టీ20 లీగ్‌లకు యూఏఈ ఇప్పటికే ఆతిథ్యం ఇచ్చింది. 2014లో ఐపీఎల్ మొదటి భాగంకు, 2019లో పూర్తి లీగ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ కొన్ని సీజన్లను కూడా నిర్వహించింది.

బాలీవుడ్ స్టార్ల ఆసక్తి
తమ నిర్ణయానికి భారత్ సహా క్రికెట్ ఆడే దేశాల నుంచి మంచి స్పందన లభించిందని ఈసీబీ జనరల్ సెక్రటరీ ముబాషిర్ ఉస్మానీ ఓ ప్రకటనలో తెలిపారు. లీగ్ కోసం ఆసక్తి చూపిస్తున్న వారిలో కొన్ని ఐపీఎల్ జట్లతో పాటు ఇండియాలోని వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్లు ఉన్నట్టు ఈసీబీ తెలిపింది. మొదటగా ఆరు జట్లతో టీ20 లీగ్‌ను ప్రారంభించాలని ఈసీబీ నిర్ణయించింది. నెల రోజుల్లో వాటాదారులను నిర్ణయించనున్నట్టు, అనంతరం అందరం కలిసి కూర్చుని టోర్నమెంట్ విధివిధానాలను నిర్ణయిస్తామని ఉస్మానీ పేర్కొన్నారు.

అత్యుత్తమ లీగుల్లో ఒకటిగా
ఈ లీగ్ కచ్చితంగా అంతర్జాతీయ క్రికెటర్లను ఆకర్షిస్తుందని, ఆటగాళ్ల వేతనం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఉస్మానీ తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ లీగుల్లో ఒకటిగా దీనిని తీర్చిదిద్దుతామని, అయితే ఐపీఎల్ ప్రమాణాల పరంగా మాత్రం కాదని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని విజయవంతమైన లీగ్‌ల మాదిరిగా లీగ్‌కు ఫ్రాంచైజ్ ఆధారిత మోడల్ ఉంటుందని వెల్లడించారు. ఈ లీగ్ ద్వారా యూఏఈలో క్రికెట్ ప్రజాదరణ పెరుగుతుందని తాము నమ్ముతున్నామని ఈసీబీ సెలక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ తాయెబ్ కమలి ధీమా వ్యక్తం చేశారు.

రెండేళ్ల క్రితమే ప్రయత్నం
రెండేళ్ల క్రితం కూడా నాలుగు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, మరో ఫ్రాంచైజీతో కలిపి టోర్నమెంట్ ప్రారంభించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రయత్నించింది. ఇందుకోసం ఈసీబీ అధికారులు ముంబై కూడా వచ్చారు. అయితే ఆ తర్వాత ఏమైందో కానీ టోర్నీ ఏర్పాటు కాలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆరు జట్లతో లీగ్ ప్రారంభించాలని ఈసీబీ గట్టిగా నిర్ణయించుకుంది. ఇప్పటికే ఈసీబీ టీ10 లీగ్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
India vs England: భారత్ టాస్ గెలిస్తే.. కోహ్లీ 250 పరుగులు చేస్తాడు: నెహ్రా


Click it and Unblock the Notifications












