వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌కు ఘోరపరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. పసికూన అఫ్గానిస్థాన్‌తో పాటు శ్రీలంక చేతిలోనూ ఓటమిపాలైంది. అంతేగాక డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఎన్నో అంచనాలు మధ్య బరిలోకి దిగి చెత్త ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఓటమి గుణపాఠాలతో ఇంగ్లాండ్ జట్టు వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది. దానిలో భాగంగా కీలక ఆటగాడు జోఫ్రా ఆర్చర్‌కు ఐపీఎల్ ఆడొద్దని ఆ దేశ క్రికెట్ బోర్డు సూచించింది.
పేసర్ జోఫ్రా ఆర్చర్ ప్రత్యర్థులను భయపెట్టే బంతుల్ని విసరడంతో పాటు బ్యాటుతో కాస్త రాణించగలడు. అందుకే ముంబయి ఇండియన్స్ అతడిని గతంలో ఏకంగా రూ. 8 కోట్లకు దక్కించుకుంది. కానీ ఈ ఏడాది ఐపీఎల్‌లో అతడు గాయపడి దాదాపు మే నెల నుంచి ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరమయ్యాడు. మరోవైపు హార్దిక్ పాండ్యను జట్టులోకి తీసుకునేందుకు ముంబయి జట్టు.. ఆల్‌రౌండర్ గ్రీన్‌ను ఆర్సీబీకి బదిలీ చేయడంతో పాటు ఆర్చర్‌ను వదులుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్ వేలంలో ఆర్చర్‌కు భారీ డిమాండ్ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆర్చర్ వేలంలో పాల్గొనేందుకు అసలు తన పేరును కూడా రిజిస్టర్ చేసుకోలేదు.

దానికి కారణం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మాస్టర్ ప్లాన్. ఏప్రిల్, మే లో తమ పర్యవేక్షణలో ఆర్చర్ ఉంటే త్వరగా కోలుకుంటాడని ఈసీబీ భావిస్తోంది. దాంతో అతడు బలంగా రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని యోచిస్తోంది. గతంలో బీసీసీఐ బుమ్రా విషయంలోనే ఇదే తరహా జాగ్రత్తలు పాటించిన సంగతి తెలిసిందే. పనిభారం, గాయాల బారిన పడకూడదని టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాను ఐపీఎల్‌కు ఆడదొద్దని సూచించింది. ఆ తర్వాత నేరుగా బుమ్రాను ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపిక చేసి వన్డే వరల్డ్‌కప్‌లో బరిలోకి దించారు. ఆ మెగాటోర్నీలో బుమ్రా గొప్ప ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.
బుమ్రా గురించి బీసీసీఐ తీసుకున్న జాగ్రత్తల బాటలోనే ఈసీబీ పయనిస్తోంది. వచ్చే ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌కప్ జరనున్న విషయం తెలిసిందే. ఆ టోర్నీకి మరో ఆరు నెలల సమయమే ఉండటంతో ఆర్చర్ మరోసారి గాయపడకుండా ఈసీబీ కాపాడుకుంటుంది. ఇక వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా ఈ పొట్టి ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తుంది.
ఈ సారి టీ20 వరల్డ్‌కప్‌నకు 20 దేశాలు పోటీపడుతున్నాయి. తొలుత అయిదు జట్లుగా నాలుగు గ్రూప్‌లు ఉంటాయి. ఆ గ్రూప్‌ల్లో నిలిచిన టాప్-2 టీమ్స్ సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఈ సూపర్-8 టీమ్స్‌ను కూడా రెండు గ్రూప్‌లుగా చేస్తారు. వాటిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. వచ్చే ఏడాది జూన్ 30న టీ20 ప్రపంచకప్ ఫైనల్ నిర్వహించే అవకాశం ఉంది.