
ఏం చేసినా గెలుపు కోసమే:
డ్వేన్ బ్రావో తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ... 'పొలార్డ్ ఎప్పుడూ గెలవడానికి ఇష్టపడతాడు. జట్టు విజయాల్ని బాగా ఆస్వాదిస్తాడు. ఒక కెప్టెన్‌గా గెలుపు కోసం అతను ఏదైనా చేయడానికి ముందుంటాడు. అందుకే సహచర ఆటగాళ్లు కూడా అతడిని గౌరవిస్తారు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో పొలార్డ్ అత్యుత్తమ ఆటగాడు. కాబట్టి విండీస్ డ్రెస్సింగ్ రూంలో పొలార్డ్ సూచనల్ని మేము అందరం గౌరవిస్తాం. పొట్టి ఫార్మాట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్ అతడు. ఎంతో అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవించబడ్డాడు' అని అన్నాడు.

దగ్గరికి వెళ్లి మరీ సంబరాలు:
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తరఫున డ్వేన్ బ్రావో ఆడుతుండగా.. ముంబై ఇండియన్స్ జట్టుకి కీరన్ పొలార్డ్ ఆడుతున్నాడు. ఇప్పటికీ ఈ ఇద్దరూ మైదానంలో సరదాగా ఆధిపత్యం చెలాయిస్తుంటారు. ముఖ్యంగా డ్వేన్ బ్రావో. పొలార్డ్ వికెట్ పడగొట్టినప్పుడు అతని దగ్గరికి వెళ్లి మరీ సంబరాలు చేసుకుంటాడు,. అయితే పొలార్డ్ మాత్రం నవ్వుకుంటాడు. ముంబై ఇండియన్స్ జట్టు కి పొలార్డ్ ఆడటంలో బ్రావో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

ప్రపంచకప్ గెలిచిన జట్టు కంటే బలంగా ఉంది:
పొట్టి ప్రపంచకప్ నెగ్గిన వెస్టిండీస్ జట్టు కంటే ప్రస్తుత జట్టు ఎంతో మెరుగ్గా ఉందని డ్వేన్ బ్రావో అన్నాడు. 2016 టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్ జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 'విండీస్ జట్టు చివరిసారిగా శ్రీలంకతో ఆడిన సిరీస్‌లో నేను కూడా ఆడాను. ఆ సమయంలో కోచ్ ఫిల్ సిమ్మన్స్ ఓ సమావేశం ఏర్పాటు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ వివరాలు చెప్తూ.. నన్ను తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరాడు. అందుకు నేను ఒప్పుకున్నా. ప్రస్తుత వెస్టిండీస్ జట్టు 2016 ప్రపంచకప్ గెలిచిన జట్టు కంటే బలంగా ఉంది. అందుకే నేను పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడానికైనా సిద్ధమే' అని బ్రావో తెలిపాడు.

17 వేర్వేరు టీ20 జట్లకు ప్రాతినిధ్యం:
కీరన్ పొలార్డ్ తన జాతీయ జట్టు వెస్టిండీస్‌తో సహా 17 వేర్వేరు టీ20 జట్లకు ఆడాడు. టీ20 ప్రపంచకప్‌తో సహా 13 టైటిళ్లు పొలార్డ్ గెలుచుకున్నాడు. విండీస్ ఆల్‌రౌండర్ పొలార్డ్ 2010 నుండి ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ జట్టు తరఫునే ఆడుతున్నాడు. ఇప్పటివరకు ముంబై తరఫున 170 మ్యాచ్‌లలో పాల్గొన్నాడు. నాలుగు ఐపీఎల్ టైటిల్స్, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20లను ముంబై గెలవడంతో తనవంతు కృషి చేసాడు.


Click it and Unblock the Notifications












