'ఎంఎస్ ధోనీ నెంబర్ 7' టీజర్‌ను వదిలిన బ్రావో.. పండగ చేసుకుంటున్న ఫాన్స్!!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి పాటను అంకితమిచ్చేందుకు ఆ జట్టు ఆటగాడు, వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సిద్ధమయిన విషయం తెలిసిందే. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఘనతలు, గొప్పతనాన్ని కీర్తిస్తూ 'ఎంఎస్ ధోనీ సాంగ్ నం7' పేరిట బ్రావో పాటను రూపొందిస్తున్నాడు. ధోనీ పుట్టినరోజును పురస్కరించుకొని జులై 7న పాటను మహీకి బ్రావో అంకితమివ్వనున్నాడు.
జులై 7కు మీరంతా సిద్ధమేనా:
'ఎంఎస్ ధోనీ సాంగ్ నం7' పాటకు సంబందించిన టీజర్‌ను సోమవారం డ్వేన్ బ్రావో విడుదల చేశాడు. 'ఎంఎస్ ధోనీ నం7.. ఎంఎస్ ధోనీ నం7.. 2007 టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్.. 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక సారథి.. జులై 7కు మీరంతా సిద్ధమేనా!!. ఆ రోజు మహీ పుట్టినరోజు. మేమంతా అతడి జన్మదిన వేడుకలను ప్రత్యేకమైన పాటతో జరుపుకోబోతున్నాం. గాయ్స్.. మమ్మల్ని ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరి హెలికాప్టర్ డాన్స్ చూడనివ్వండి' అని బ్రావో ఇన్‌స్టాలో టీజర్ వీడియోను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట్లో వైరల్ అయింది. ముఖ్యంగా మహీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

అద్భుతమైన గాయకుడు.. అంతకుమించి మంచి డాన్సర్:
ఎంఎస్ ధోనీ జన్మదిన వేడుకలకు ఇంకా వారం రోజులు ఉన్నాయి. అయితే డ్వేన్ బ్రావో అప్పుడే సంబరాలు మొదలు పెట్టాడు. ఎందుకంటే.. బ్రావోకి ధోనీ అంటే ఎంతో ఇష్టం. అంతేకాదు వీరిద్దరి మధ్య విడదీయరాని స్నేహబంధం ఉంది. చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ఈ ద్వయం ఎన్నో అద్భుతాలు చేసింది. అందుకే ఈ పుట్టిన రోజుకు ఓ పాటను మహీకి బ్రావో అంకితమివ్వనున్నాడు. బ్రావో అద్భుతమైన గాయకుడు. అంతకుమించి మంచి డాన్సర్. తానే స్వయంగా పాటలు రాసి వీడియోలు చేస్తాడు.

మరింత శ్రద్ధతో పాట:
ఎంఎస్ ధోనీ నంబర్ 7 అంటూ సాగే ఈ పాట మహీ అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయంగా కనిపిస్తోంది. గాయకుడిగా ఇప్పటికే చాలాసార్లు అలరించిన డ్వేన్ బ్రావో తనకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి మరింత శ్రద్ధతో పాటను రూపొందిస్తున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉన్న బ్రావో మొత్తం దృష్టి ఈ పాటపైనే పెట్టాడట. బ్రావో వెస్టిండీస్ తరఫున 40 టెస్టులు, 164 వన్డేలు, 71 టీ20లు ఆడాడు.

మహీ కోసం ఏదైనా చేయాలనిపించింది
బ్రావో గతంలో ఓసారి మాట్లాడుతూ ధోనీ కోసం ఏదైనా కొత్తగా చేయాలని ఉందన్నాడు. మహీ ఎంతో మంది ఆటగాళ్లకు అవకాశాలిచ్చాడని, అందుకే అతడిపై ఓ పాట రాస్తున్నానన్నాడు. ఇలా ఏ క్రీడాకారుడిపైనా ఎవరూ పాటతో తమ అభిమానాన్ని చాటలేదని, తానే కొత్త ఆలోచనలతో వచ్చానని తెలిపాడు. 'ధోనీ కెరీర్ తుది ఘట్టానికి చేరింది. అతడి కోసం ఏదైనా చేయాలని అనిపించింది. అతడి కెరీర్ మొత్తం అద్భుతంగా సాగింది. నా వ్యక్తిగత కెరీర్‌పైనా చాలా ప్రభావం చూపాడు. అలాగే ఎంతో మంది ఆటగాళ్లకు వెన్నుదన్నుగా నిలిచాడు. దేశం కూడా గర్వపడేలా కప్పులు సాధించాడు. అందుకే అతడి కోసం ఏదైనా చేయాలనిపించింది. అందుకే ఈ పాట రాస్తున్నా' అని బ్రావో వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
సచిన్ టెండూల్కర్ ఆ అరుదైన మైలురాయికి 13ఏళ్లు!!