వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోషల్ మీడియా వేదికగా గురువారం ఈ విషయాన్ని వెల్లడించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రింబాగో నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న బ్రావోకు సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గజ్జల్లో గాయమైంది. అనంతరం ఆటకు గుడ్‌బై పలకాలని బ్రావో నిర్ణయించుకున్నాడు.
ఈ వెస్టిండీస స్టార్ 2021లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే అనంతరం ఫ్రాంచైజీ లీగుల్లో కొనసాగాడు. ఆటను కొనసాగించాలని మనస్సు చెబుతున్నప్పటికీ, శరీరం సహకరించట్లేదని ఆటకు గుడ్‌బై చెబుతున్నాని బ్రావో పేర్కొన్నాడు. వచ్చే నెలలో బ్రావోకు 41 ఏళ్లు వస్తాయి. టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ రికార్డు బ్రావో పేరిట ఉంది.

టీ20 క్రికెట్‌లో 582 మ్యాచ్‌లు ఆడిన బ్రావో 631 వికెట్లు పడగొట్టాడు. 6970 పరుగులు చేశాడు. రెండుసార్లు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఐపీఎల్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లీగ్‌ల్లోనూ విజేతగా సత్తాచాటాడు. సీపీఎల్‌లో అయిదుసార్లు ట్రోఫీని అందుకోగా, అందులో మూడు సార్లు ట్రింబాగో నైట్ రైడర్స్ తరఫున అందుకున్నాడు.
ఇక వెస్టిండీస్ తరఫున బ్రావో 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 2200 పరుగులు, 86 వికెట్లు తీశాడు. వన్డేల్లో 2968 పరుగులు, 199 వికెట్లు, పొట్టి ఫార్మాట్‌లో 1255 పరుగులు, 78 వికెట్లు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్రావో బౌలింగ్ కన్సల్టెంట్‌గా సేవలందిస్తున్నాడు.
''21 ఏళ్లగా ప్రోఫెషనల్ క్రికెట్ ఆడాను. ఎత్తుపల్లాలు చూశాను. ప్రతిసారి 100 శాతం సామర్థ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాను. మీతో అనుబంధాన్ని కొనసాగాలని ఉంది. కానీ వాస్తవికతను కూడా అర్థం చేసుకోవాలి. మనస్సు ఆటను కొనసాగమని చెబుతున్నా, గాయాల కారణంగా శరీరం సహకరించట్లేదు. ఛాంపియన్ వీడ్కోలు పలికాడు'' - బ్రావో