
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వైన్ ప్రిటోరియస్ ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో తన జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ నుండి చాలా నేర్చుకున్నానని ప్రిటోరియస్ తెలిపాడు. తీవ్ర ఒత్తిడిలోనూ కూడా అత్యంత ప్రశాంతంగా ఉండగల నేర్పును ధోనీ నుంచి తాను నేర్చుకున్న అతిపెద్ద లెస్సన్ అని పేర్కొన్నాడు.
క్రికెట్లో ఏదైనా సాధ్యమేనని ధోనీ నమ్ముతాడని చెప్పాడు. ఒక బౌలర్‌గా మీరు చివరి మూడు బంతుల్లో 18పరుగులను కాపాడుకోవాల్సిన తరుణంలోనూ ఓడిపోయే అవకాశముందని, ఒక బ్యాటర్‌గా గెలిచే అవకాశముందని ధోనీ భావిస్తాడని చెప్పాడు. ధోనీ ఏ విషయానికి అంత ఎక్సైట్ కాడు. తనను తాను ఎప్పుడూ కూడా నేర్చుకునే వ్యక్తిలాగే భావిస్తాడని ప్రిటోరియస్ చెప్పాడు.
ప్రిటోరియస్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీ20 జట్టులో ఉన్నాడు. భారత పర్యటనకు వచ్చిన జట్టులో అతను కూడా ఒకడు. జూన్ 9న న్యూ ఢిల్లీలో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అతను సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ధోనీ సారథ్యంలో ఆడడం పట్ల అతని అభిప్రాయాన్ని కోరగా అతను స్పందిస్తూ.. 'డెత్ ఓవర్లలో బ్యాటర్ కంటే బౌలర్ ఎక్కువ ఒత్తిడికి గురవుతాడని ధోనీ నమ్మకం. అతని నుంచి నేను నేర్చుకున్న అతి పెద్ద విషయం ఏమిటంటే.. అతను క్రీజ్‌లో ఎంతో ప్రశాంతంగా ఉండి.. తనపై ఒత్తిడిని తగ్గించి ఆ ఒత్తిడినంతా బౌలర్‌పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు.
ధోనీ బ్యాటింగ్ విధానం ఎలాగుంటుందంటే డెత్ ఓవర్లలో బ్యాటర్ అంత ఒత్తిడికి లోనవ్వాల్సిన పనిలేదని, నిజానికి ఎక్కువ ఒత్తిడికి లోనవ్వాల్సింది బౌలరేననేలా అతని ఆటతీరు ఉంటుంది.' అని పేర్కొన్నాడు.ఇకపోతే ఐపీఎల్ 2022లో సీఎస్కే కేవలం 14మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఇక జట్టు గురించి ప్రిటోరియస్ మాట్లాడుతూ.. జట్టులో అనుభవజ్ఞులు అయిన ప్లేయర్లు ఉన్నారు.
కష్టమైన పరిస్థితులను అధిగమించడంలో ఎలా వ్యవహరించాలో వారు తమ సూచనలు మాకు చెప్పేవారు. క్రికెట్ ఆట ఎప్పుడూ మనకు అనుగుణంగానే సాగదని, అప్పుడప్పుడు ఒడిదొడుకులు సహజం అని మేమంతా అర్థం చేసుకున్నాము. ఈ సీజన్ నుంచి కొన్ని సానుకూలాంశాలను తీసుకుని, ఫ్యూచర్లో మరింత పటిష్ఠంగా కమ్ బ్యాక్ కావడానికి ప్రయత్నిస్తాం.' అని ప్రిటోరియస్ చెప్పాడు.