
శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 2వ టెస్టులో 4వ రోజు శ్రీలంక జట్టు భారీ స్కోరు సాధించి ఆస్ట్రేలియాపై 190పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఆస్ట్రేలియాపై దినేష్ చండిమాల్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక కమాండింగ్ పొజిషన్లోకి వచ్చింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 364/10 స్కోర్ చేశాక.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో టాప్-ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు.
కెప్టెన్ దిముత్ కరుణరత్నే (165 బంతుల్లో 86), కుశాల్ మెండిస్ (161 బంతుల్లో 85), ఏంజెలో మాథ్యూస్ (117 బంతుల్లో 52), కమిందు మెండిస్ (137 బంతుల్లో 61) రాణించడంతో పాటు దినేష్ చండీమాల్ (206పరుగులు 326బంతులు 16ఫోర్లు, 5సిక్సులు నాటౌట్) వీరోచిత డబుల్ సెంచరీతో ఆస్ట్రేలియా బౌలింగ్‌ను తుత్తునియలు చేయడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 554/10 స్కోరు చేయగలిగింది. పాతుమ్ నిస్సాంక (25 బంతుల్లో 6) తప్ప.. శ్రీలంక టాప్-ఆర్డర్ బ్యాటర్‌లో ఐదుగురు ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలు చేయడం గమనార్హం. ఇందులో దినేష్ చండిమాల్‌ది డబుల్ సెంచరీ.
చండిమాల్ ఈ మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేయడం ద్వారా టెస్టుల్లో తన 13వ సెంచరీని సాధించాడు. అతని ప్రదర్శనకు గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక చండిమాల్ తన ఇన్నింగ్స్‌లో భాగంగా కొట్టిన సిక్సు.. స్టేడియం అవతల పడింది. అదే టైంలో స్టేడియం అవతల రోడ్డుపై నడచుకుంటూ కొందరు కుర్రాళ్లు వెళుతున్నారు. అందులో ఓ కుర్రాడికి ఆ బాల్ తాకింది. అతని వైపు బాల్ వస్తుండగా ఆ కుర్రాడు గమనించి దాన్ని అడ్డుకోవాలని చూసినప్పటికీ అది అతని తొడలకు, పొత్తి కడుపుకు మధ్య తాకింది.
అప్పటికే స్టప్ప్ తిని బంతి స్లో అవ్వడంతో అతనికి పెద్దగా ఏం కాలేదు. ఈ ఘటన 179వ ఓవర్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జరిగింది. స్టార్క్ లెంగ్త్ డెలివరీని ఆఫ్ స్టంప్ వెలుపల వేశాడు. దాన్ని దినేష్ చండిమాల్ మిడ్-వికెట్‌పై సిక్స్ బాదాడు. దీంతో బంతి స్టేడియం అవతల పడింది. తర్వాత అదే ఓవర్లో మరో సిక్సర్ బాది చండిమాల్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని అద్భుతమైన నాక్‌కు ప్రేక్షకులు, సహచరులు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు.