
దిండిగల్: భారత దేశవాళీ క్రికెట్ సీజన్ (2018-19)కు రంగం సిద్ధమైంది. సీజన్ మొదటి టోర్నీ అయిన దులీప్ ట్రోఫీ శుక్రవారం నుంచి జరిగే దులీప్ ట్రోఫీతో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. తమిళనాడులోని దిండిగల్ వేదికగా జరగనున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఇండియా 'గ్రీన్'తో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా 'రెడ్' తలపడనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో పింక్ బంతితో మూడు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
లీగ్ మ్యాచ్‌లన్నీ నాలుగు రోజులు... సెప్టెంబర్ 4నుంచి ఫైనల్ ఐదు రోజులు జరుగుతుంది. ఇండియా 'రెడ్'కు అభినవ్ ముకుంద్ కెప్టెన్ కాగా... 'గ్రీన్'కు పార్థివ్ పటేల్, 'బ్లూ'కు ఫైజ్ ఫజల్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో భారత ఓపెనర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతున్న నేపథ్యంలో అభినవ్ ముకుంద్, పార్థివ్ పటేల్‌లు తాము ఆ స్థానాలకు అర్హులమే అని నిరూపించుకునేందుకు ఇది సరైన అవకాశం. భారత రెగ్యూలర్ టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా సీనియర్ జట్టు ఆడుతున్నటెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
అతని స్థానంలో ఎంపికైన దినేశ్ కార్తీక్ ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించలేకపోతున్న నేపథ్యంలో పార్థివ్ పటేల్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటే అతను సత్తా చాటక తప్పదు. వీళ్లతో పాటు కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ఫైజ్ ఫజల్, ధవల్ కులకర్ణి, పర్వేజ్ రసూల్, బాసిల్ థంపి, గుర్బాని, గణేశ్ సతీశ్, బి. సందీప్, ఎ. మిథున్, అంకిత్ రాజ్‌పుత్, జైదేవ్ ఉనదక్త్‌లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఆంధ్ర క్రికెటర్లు శ్రీకర్ భరత్, అయ్యప్ప ఇండియా 'బ్లూ' జట్టుకు, పృథ్వీరాజ్ 'రెడ్' జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రెండు రోజులు ఆలస్యంగా...
ఆస్ట్రేలియా ఏ, దక్షిణాఫ్రికా ఏలతో పాటు భారత ఏబీ జట్లు పాల్గొంటున్న క్వాడ్రాంగులర్ వన్డే టోర్నీ కూడా శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వాతావరణం ప్రతికూలంగా మారడంతో శుక్ర, శనివారాల్లో జరగాల్సిన మ్యాచ్‌లను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మూలపాడులో జరిగే ఈ టోర్నీ ఫైనల్ ఆగష్టు నెల 29న నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా జట్టుకు జోండో కెప్టెన్ కాగా... ఆస్ట్రేలియాకు ట్రవిస్ హెడ్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. భారత్ 'ఎ' జట్టుకు శ్రేయస్ అయ్యర్, 'బి' జట్టుకు మనీశ్ పాండే కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.