టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోసారి విఫలమయ్యాడు. అనంతపురం వేదికగా ఇండియా-బీతో జరుగుతున్న మ్యాచ్‌లో డకౌటయ్యాడు. అయిదు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరుకున్నాడు. రాహుల్ చాహర్ వేసిన బంతిని షాట్‌కు యత్నించి నితీశ్ కమార్ రెడ్డి చేతికి చిక్కాడు.
దులీప్ ట్రోఫీలో ఇండియా-డీ జట్టుకు శ్రేయస్ సారథి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో శ్రేయస్ డకౌటవ్వడం ఇది రెండోసారి. ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్‌లోనూ శ్రేయస్ డకౌటైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ టెస్టు కెరీర్ భవితవ్యంపై చర్చ మొదలైంది. నెట్టింట్లో అయ్యర్‌పై దారుణంగా విమర్శలు వస్తున్నాయి.

ఈ దులీప్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ వరుసగా 9, 54, 0, 41, 0 స్కోరు మాత్రమే చేశాడు. అయిదు ఇన్నింగ్స్‌ల్లో రెండు సార్లు డకౌటై రెండుసార్లు మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నాడు. అంతకుముందు తమిళనాడు వేదికగా జరిగిన బుచ్చిబాబు టోర్నమెంట్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన అతను 2, 22 పరుగులే చేసి నిరాశపరిచాడు. భారత టెస్టు జట్టులో చోటు, సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్‌కు దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ ఎంతో కీలకం.
టీమిండియా టెస్టు జట్టులోకి తిరిగి చోటు సంపాదించాలంటే ఈ దేశవాళీ టోర్నీలో పరుగుల వరద పారించాల్సి ఉంది. కానీ శ్రేయస్ అయ్యర్ వరుసగా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్ టెస్టు కెరీర్‌ను ముగిసిందని నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ 10 టెస్టులు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో రెండు, న్యూజిలాండ్ మూడు, ఆస్ట్రేలియాతో అయిదు టెస్టులు ఆడనుంది.
శ్రేయస్ శతకాల మోత మోగించి ఉంటే.. కివీస్ సిరీస్‌తో తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉండేవి. కానీ శ్రేయస్ పేలవమైన ఆటతో నిరాశపరుస్తున్నాడు. దీంతో మరో కొన్నాళ్లు టెస్టుల్లో శ్రేయస్ పునరాగమం అనుమానమే అని క్రికెట్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.