దులీప్ ట్రోఫీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇండియా-ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-బీ పైచేయి సాధిస్తోంది. మూడో రోజు ఆట ముగిసేసరికి ఆరు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. టీమ్-ఏ కంటే 240 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రిషభ్ పంత్ (61; 47 బంతుల్లో, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (46; 36 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు.
యశస్వీ జైస్వాల్ (9), అభిమన్యు ఈశ్వరన్ (4), ముషీర్ ఖాన్ (డకౌట్), నితీశ్ రెడ్డి (19) నిరాశపరిచారు. మూడో రోజు ఆట ఆఖరి ఓవర్‌లో నితీశ్ వికెట్ చేజార్చుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో సుందర్ (6 నాటౌట్) ఉన్నాడు. ఖలీల్ అహ్మద్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. అయితే 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచిన జట్టును పంత్‌తో కలిసి సర్ఫరాజ్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మూడో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

సర్ఫరాజ్ విరుచుకుపడటంతో.. వీరిద్దరు 29 బంతుల్లోనే అర్ధశతకం భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆకాశ్ దీప్ వేసిన పదో ఓవర్‌లో సర్ఫరాజ్ ఖాన్ వరుస బౌండరీలతో హోరెత్తించాడు. తొలి బంతి మినహా మిగిలిన బంతుల్ని ఫోర్ బాది 20 పరుగులు పిండుకున్నాడు. గల్లీ, కవర్, స్క్వేర్ లెగ్, మిడాఫ్, థర్డ్ మ్యాన్ దిశగా వరుసగా అయిదు బౌండరీలు బాదాడు.
కాగా, 134/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ఆరంభించిన ఇండియా-ఏ జట్టు 231 పరుగులకు ఆలౌటైంది. శనివారం ఆట ప్రారంభమైన కాసేపటికే రియాన్ పరాగ్ (30) ఔటయ్యాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (37) టాప్ స్కోరర్. ముకేశ్ కుమార్, నవదీప్ సైని చెరో మూడు, సాయి కిశోర్ రెండు వికెట్లు తీశారు.
ఇండియా-బీ మొదటి ఇన్నింగ్స్‌లో 321 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (181; 373 బంతుల్లో, 16 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం బాదాడు. నవదీప్ సైని (56; 144 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకం సాధించాడు. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు తీశాడు.
4⃣4⃣4⃣4⃣4⃣
— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2024
Sarfaraz Khan on 🔥
He hits five fours in an over, off Akash Deep!
What delightful strokes 👌#DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/AWE5JhJiuS