దేశవాళీ ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీలో ఇండియా-ఏ బోణీ కొట్టింది. అనంతపురం వేదికగా ఇండియా-డీతో జరిగిన మ్యాచ్‌లో 186 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటి రౌండ్‌లో ఇండియా-బీ చేతిలో ఓడిన ఏ-టీమ్ రెండో రౌండ్‌లో పుంజుకుంది. మరోవైపు ఇండియా-డీ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అంతకుముందు ఇండియా-సీ చేతిలో డీ-టీమ్ ఓడిన సంగతి తెలిసిందే.
ఇండియా-ఏ జట్టుకు మయాంక్ అగర్వాల్, ఇండియా-డీ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, ఓవర్‌నైట్ స్కోరు 62/1తో, 488 పరుగుల భారీ లక్ష్యంతో ఇవాళ ఆఖరి రోజు ఆటను ఆరంభించిన ఇండియా-డీ జట్టు 301 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్రా కుర్రాడు రికీ భుయ్ (113; 195 బంతుల్లో, 14 ఫోర్లు, 3 సిక్సర్) పోరాడాడు.

ఇవాళ ఆట ఆరంభమైన కాసేపటికే యశ్ దూబె (34), ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో దేవదత్ పడిక్కల్ (1) స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యారు. అనంతరం శ్రేయస్ అయ్యర్ (41), సంజు శాంసన్ (40)తో కలిసి రికీ భుయ్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించారు. కానీ జట్టు-ఏ బౌలర్లు పుంజుకుని కీలక దశలో వికెట్లు పడగొట్టారు. అయ్యర్‌తో రికీ భుయ్ నాలుగో వికెట్‌కు 53 పరుగులు, శాంసన్‌తో అయిదో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు.
వికెట్లు పడుతున్నా రికీ భుయ్ స్కోరు బోర్డు ముందుకు నడిపిస్తూ సెంచరీ అందుకున్నాడు. కానీ కాసేపటికే అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇండియా-డీ జట్టు ఓటమి లాంఛనమైంది. ఆఖర్లో హర్షిత్ రాణా (24; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) కీలక పరుగులు చేశాడు. తనుష్ కొటియన్ నాలుగు, షామ్స్ ములాని మూడు వికెట్లు తీశారు.
స్కోరు వివరాలు
ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్: 290 ఆలౌట్; షామ్స్ ములాని (89), హర్షిత్ రాణా 4/51
ఇండియా-డీ తొలి ఇన్నింగ్స్: 183 ఆలౌట్; దేవదత్ పడిక్కల్ (92), ఖలీల్ అహ్మద్ 3/39
ఇండియా-ఏ రెండో ఇన్నింగ్స్: 380/3 డిక్లేర్; ప్రథమ్ సింగ్ (122), తిలక్ వర్మ (111*), సౌరభ్ 2/110
ఇండియా-డీ రెండో ఇన్నింగ్స్: 301 ఆలౌట్; రికీ భుయ్ (113), తనుష్ 4/73.
💯 for Ricky Bhui 🙌
— BCCI Domestic (@BCCIdomestic) September 15, 2024
He gets there in style 👌
A splendid knock so far in the fourth innings #DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/WM6ae4iOcv