భారీ అంచనాల మధ్య దులీప్ ట్రోఫీలోకి బరిలోకి దిగిన తెలుగు కుర్రాడు, యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి నిరాశపరిచాడు. ఇండియా-బీ తరఫున ఆడుతున్న నితీశ్.. ఇండియా-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో గోల్డెన్ డకౌటయ్యాడు. ఆర్సీబీ బౌలర్ ఆకాశ్ దీప్ వేసిన స్టన్నింగ్ డెలివరీని ఎదుర్కోవడంలో విఫలమయ్యాడు. కీలక సమయంలో తన వికెట్‌ను చేజార్చుకున్న నితీశ్ రెడ్డి పరోక్షంగా జట్టును తీవ్ర కష్టాల్లోకి నెట్టాడు.
భవిష్యత్ స్టార్ ఆల్‌రౌండర్‌గా పేరొందిన నితీశ్ రెడ్డి ఇటీవల జింబాబ్వే పర్యటనకు ఎంపికైన విషయం తెలిసిందే. అయితే 21 ఏళ్లకే టీమిండియాలో ఆడే అవకాశం వచ్చిందని సంతోషించేలోపే నితీశ్‌కు చుక్కెదురైంది. గాయం అతన్ని జింబాబ్వే టీ20 సిరీస్ నుంచి దూరం చేసింది. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు నితీశ్ ఎంపిక కాలేదు. అయితే నితీశ్‌ను మరో హార్దిక్ పాండ్యగా చేయాలని బీసీసీఐ భావించి, అతని గాయం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించింది.

దులీప్ ట్రోఫీకి నితీశ్‌ను ఎంపిక చేసినప్పటికీ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే ఇండియా-బీకి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే తిరిగి కోలుకున్న నితీశ్ భారీ అంచనాల మధ్య ఇవాళ బరిలోకి దిగాడు. కానీ బ్యాటర్‌గా విఫలమయ్యాడు. అయితే రిషభ్ పంత్ (7; 10 బంతుల్లో, 1 ఫోర్) ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన నితీశ్ తొలి బంతికే ఔటవ్వడంతో జట్టు ఒత్తిడిలోకి వెళ్లింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-బీ జట్టు 33 పరుగులకే కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (13; 42 బంతుల్లో, 1 ఫోర్) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రమంగా యశస్వీ జైస్వాల్ (30; 59 బంతుల్లో, 6 ఫోర్లు), సర్ఫరాజ్ ఖాన్ (9; 35 బంతుల్లో, 1 ఫోర్) కూడా ఔటయ్యారు. అయితే ఆదుకుంటాడనుకున్న పంత్.. గిల్ అద్భుతమైన క్యాచ్‌కు వెనుదిరిగాడు. దీంతో నితీశ్ నిదానంగా ఆడి జట్టును కాపాడే పరిస్థితి ఏర్పడింది. కానీ ఆకాశ్ దీప్ చక్కని బంతికి తెలుగు ఆల్‌రౌండర్ వెనుదిరిడం బీ-జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. కాగా, ప్రస్తుతం బీ జట్టు 89 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.