దులీప్ ట్రోఫీ-2024లో రుతురాజ్ గైక్వాడ్ జట్టు ఘనంగా బోణీ కొట్టింది. అనంతపురం వేదికగా ఇండియా-డీతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-సీ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆరు పాయింట్లతో పట్టికలో సీ-టీమ్ అగ్రస్థానంలో నిలిచింది. డీ జట్టుకు శ్రేయస్ అయ్యర్, సీ జట్టుకు రుతురాజ్ సారథి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.
ఓవర్‌నైట్ స్కోరు 206/8తో మూడో రోజు ఆటను ఆరంభించిన ఇండియా-డీ 236 పరుగులకు ఆలౌటైంది. ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో అక్షర్ పటేల్ (28; 59 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) సెకండ్ ఇన్నింగ్స్‌లో మ్యాజిక్ చేయలేకపోయాడు. ఇవాళ ఆట ప్రారంభమైన కాసేపటికే వికెట్ కోల్పోయాడు. అక్షర్ ఔటైనా కొన్ని నిమిషాలకే డీ జట్టు ఆఖరి వికెట్ కూడా కోల్పోయింది.

దేవదత్ పడిక్కల్ (56; 70 బంతుల్లో, 8 ఫోర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (54; 44 బంతుల్లో, 9 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకాలు సాధించారు. మానవ్ సుతార్ ఏడు వికెట్లతో విజృంభించాడు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీ జట్టు 61 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్యన్ జుయాల్ (47; 74 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (46; 48 బంతుల్లో, 8 ఫోర్లు), రజత్ పటిదార్ (44; 77 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
అభిషేక్ పోరెల్ (35 నాటౌట్; 63 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), మానవ్ సుతార్ (19; 43 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) జట్టును విజయతీరాలకు చేర్చారు. సరన్ష్ నాలుగు వికెట్లు తీశాడు. కాగా, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా-డీ తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ (86; 118 బంతుల్లో, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) టాప్ స్కోరర్. విజయ్‌కుమార్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఇండియా-సీ మొదటి ఇన్నింగ్స్‌లో 168 పరుగులకు ఆలౌటైంది. ఇంద్రజిత్ (72; 149 బంతుల్లో, 9 ఫోర్లు) అర్ధశతకం సాధించాడు. హర్షిత్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టాడు.