దులీప్ ట్రోఫీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియా-ఏ వర్సెస్ ఇండియా-బీ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. ఓవర్‌నైట్ స్కోరు 150/6తో ఆఖరి రోజు ఆటను ఆరంభించిన ఇండియా-బీ 184 పరుగులకే కుప్పకూలింది. 34 పరుగులే జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఆకాశ్ దీప్ అయిదు వికెట్లు, ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగారు. రిషభ్ పంత్ (61; 47 బంతుల్లో, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (46; 36 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్లు. కాగా, ఈ ఇన్నింగ్స్‌లో ధ్రువ్ జురెల్ ఏడు క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో ధ్రువ్ అరుదైన రికార్డు సాధించాడు.

దులీప్ ట్రోఫీలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీ సరసన ధ్రువ్ జురెల్ నిలిచాడు. 2004-05 సీజన్‌లో ఈస్ట్ జోన్ తరఫున ధోనీ ఈ ఘనత సాధించాడు. రెండు దశాబ్దాల తర్వాత ఈ రికార్డును ఇండియా-ఏ తరఫున ధ్రువ్ సమం చేశాడు. ఇక తర్వాతి స్థానాల్లో బెంజమిన్ (6 క్యాచ్‌లు, 1973-74), విశ్వనాథ్ (6 క్యాచ్‌లు, 1980-21) ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆఖరి రోజు అయిన ఇవాళ ఆటలో మిగిలిన 78 ఓవర్లలో.. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఏ జట్టు 76 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ (3; 4 బంతుల్లో), రియాన్ పరాగ్ (31; 18 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (21; 35 బంతుల్లో, 2 ఫోర్లు), ధ్రువ్ జురెల్ (డకౌట్), తనుష్ కొటియన్ (డకౌట్) వరుసగా పెవిలియన్‌కు చేరారు. క్రీజులో కేఎల్ రాహుల్ (24), శివమ్ దూబె ఉన్నారు.
కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియా-బీ 321 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (181; 373 బంతుల్లో, 16 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం బాదాడు. నవదీప్ సైని (56; 144 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకం సాధించాడు. ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు తీశాడు. ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (37) టాప్ స్కోరర్. ముకేశ్ కుమార్, నవదీప్ సైని చెరో మూడు, సాయి కిశోర్ రెండు వికెట్లు తీశారు.