ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియా-డీ తరఫున బరిలోకి దిగిన అక్షర్..అనంతపురం వేదికగా ఇండియా-సీతో జరుగుతున్న మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే జట్టును ఒంటిచేత్తో ఆదుకున్న అతను మానవ్ స్టన్నింగ్ క్యాచ్‌తో సెంచరీని కోల్పోయాడు. బౌండరీ లైన్‌లో మానవ్ డై చేస్తూ అద్భుత రీతిలో క్యాచ్‌ను అందుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-డీ 48.3 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ (86; 118 బంతుల్లో, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) టాప్ స్కోరర్. అక్షర్ తర్వాత జట్టులో అత్యధిక స్కోరు 13 మాత్రమే. దీన్ని బట్టే తెలిసి ఉంటుంది అక్షర్ పోరాటం గురించి. డీ టీమ్‌ను అన్షుల్ తొలి దెబ్బకొట్టాడు. నాలుగు పరుగులకే అథర్వ (4; 5 బంతుల్లో, 1 ఫోర్) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.

వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9; 16 బంతుల్లో, 1 ఫోర్) కూడా విఫలమయ్యాడు. ఆ తర్వాత డీ టీమ్ బ్యాట్లెత్తేసింది. 23 పరుగుల వద్దే మూడు వికెట్లు కోల్పోయింది. 23/2, 23/3, 23/4, 34/5, 48/6, 76/7, 76/8.. ఇలా వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అర్షదీప్ సింగ్ (13; 33 బంతుల్లో, 1 సిక్సర్)తో కలిసి అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. తొమ్మిదో వికెట్‌కు ఏకంగా 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
అయితే ఈ భారీ భాగస్వామ్యానికి విజయ్‌కుమార్ తెరదించాడు. అర్షదీప్‌ను ఔట్ చేశాడు. దీంతో మరింత దూకుడుగా ఆడాలనుకున్న అక్షర్ భారీ షాట్‌కు యత్నించి.. బౌండరీ లైన్‌లో మానవ్ అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగాడు. టీమ్-సీ బౌలర్లలో విజయ్‌కుమార్ మూడు వికెట్లు, అన్షుల్, హిమాన్షు చెరో రెండు వికెట్లు తీశారు. మానవ్, హృతిక్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన టీమ్-సీ కూడా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. హర్షిత్ రాణా ధాటికి 14 పరుగులకే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (5; 19 బంతుల్లో, 1 ఫోర్), సాయి సుదర్శన్ (7; 16 బంతుల్లో, 1 ఫోర్) వెనుదిరిగారు.