హైదరాబాద్: బెంగుళూరు వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన రెండో టెస్టులో చెలరేగిన డీఆర్ఎస్ వివాదం ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించడం లేదు. తాను డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి సైగలు చేసిన వివాదంపై తాను అలా చేసి ఉండాల్సింది కాదని, కెప్టెన్ గానే కాకుండా ఆటగాడిగా కూడా అలా వ్యవహరించకూడదని స్మిత్ పేర్కొన్నాడు.
'బంతి నేరుగా వచ్చి నా ప్యాడ్‌కు తాకింది. దీంతో స్ట్రైకర్ బ్యాట్స్‌మన్ కోసం చూశాను. నాన్ స్ట్రైకర్‌తో మాట్లాడాక నేను డ్రెస్సింగ్ రూం వైపు చూశాను. నేను అలా చేసి ఉండాల్సింది కాదు. ఇలా జరగడం ఇదే మొదటిసారి. నా జట్టు ఆటగాళ్ల వైపు చూశాను. అప్పుడు బుర్ర కొద్దిగా పనిచేయలేదు' అని పేర్కొన్నాడు.
ఈ వివాదంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే స్టీవ్ స్మిత్ తీరుపై మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని అంత సులువుగా వదలేయకూడదని టీమిండియా భావిస్తోంది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌కు సూచించింది.

స్టీవ్ స్మిత్ వీడియోలు పలు మార్లు పరిశీలించామని చెప్పిన బీసీసీఐ టీమిండియా కెప్టెన్ కోహ్లీకి అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
మైదానంలో కోహ్లీ వ్యవహరించిన తీరు పరిపూర్ణమైన సమయోచితమైన క్రికెటర్‌గా కొనియాడింది.
స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి సైగలు చేయడం పట్ల కోహ్లీ ఫీల్డ్ అంపైర్లు నిగెల్ లాంగ్‌ను ప్రశ్నించాడని, అప్పుడు అంపైర్ కూడా కోహ్లీకి మద్దతు పలికాడని బీసీసీఐ గుర్తుచేసింది. ఆ సమయంలో బుర్ర పనిచేయలేదని మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్టీవ్ స్మిత్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది.
మిగతా రెండు మ్యాచ్‌ల్లోనైనా ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిజమైన క్రీడా స్ఫూర్తితో క్రికెట్ ఆడాలని భావిస్తున్ననట్లు బీసీసీఐ పేర్కొంది. అయితే ఈ వివాదం ఇంకెంత కాలం సాగుతుందో తెలియాల్సి ఉంది. మరోవైపు స్మిత్‌పై టీమిండియా వ్యాఖ్యలు దారుణమని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ అన్నారు.
స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా టీమ్ చిత్తశుద్ధిని అనుమానించేలా ఈ ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఆస్ట్రేలియా జట్టు కోచ్ డారెన్ లీమన్ కూడా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను వెనకేసుకొచ్చాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పుగా ఆలోచిస్తున్నాడని అన్నాడు.