
హైదరాబాద్: అండర్-19 వరల్డ్ కప్ కోసం సన్నద్ధమైన యువ కుర్రాళ్లు రాబోయే 6-8 నెలల్లో భారత్-ఏ జట్టుకు ఆడే అవకాశం ఉందని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. జనవరి 13 నుంచి న్యూజిలాండ్‌లో జరిగే ఈ వరల్డ్ కప్ కోసం భారత అండర్-19 జట్టు గురువారం ఉదయం ఇక్కడ నుంచి బయల్దేరనుంది.
ఈ సందర్భంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. 'ఎంపికైన కుర్రాళ్లెవరికీ కివీస్‌లో ఆడిన అనుభవం లేదు. ఈ వరల్డ్ కప్ వాళ్లకు పెద్ద చాలెంజ్. అక్కడ రాణిస్తే వచ్చే 6-8 నెలల్లో భారత్ 'ఎ' జట్టుకు ఆడినా ఆడొచ్చు. వాళ్లకది గొప్ప ఘనత అవుతుంది. ఆపై సీనియర్ జట్టుకూ ఎంపిక కావచ్చు' అని అన్నాడు.

'భారత 'ఎ', అండర్-19 జట్ల కోచ్‌గా నేనెంతో నేర్చుకున్నాను. ఈ తరం కుర్రాళ్లది పూర్తిగా భిన్నమైన నేపథ్యం. వాళ్ల ఆలోచనలు కూడా భిన్నమే. మూడు ఫార్మాట్లను ఆకళింపు చేసుకోగలరు. నిజంగా ఇది పెను సవాల్. ఎందుకంటే ఇప్పుడు ఆట ఎంతో మారింది' అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
'అయితే వీళ్లలో ఎవరు గొప్ప ఆటగాళ్లు అవుతారు? ఎవరు జాతీయ జట్టుకు ఎంపికవుతారని చెప్పడం కష్టం. ఈ జట్టు కెప్టెన్ పృథ్వీ షా ఇప్పటికే భారత్ 'ఎ' తరఫున న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడాడు' అని ద్రవిడ్ అన్నాడు. జనవరి 13 నుంచి కివీస్‌లో జరిగే ఈ టోర్నీలో పృథ్వీ షా సేన చక్కగా రాణిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
'ముందుగా కివీస్ పరిస్థితులకు అలవాటు పడాలి. బెంగళూరులో నిర్వహించిన శిబిరంలో అలాంటి వాతావరణం కల్పించినప్పటికీ భౌగోళిక పరిస్థితుల వల్ల అది సాధ్యం కాలేదు' అని ద్రవిడ్ అన్నాడు. అనంతరం కెప్టెన్ పృథ్వీ షా మాట్లాడాడు.
'కెప్టెన్‌గా నాకు ఇది నాకు ఓ గొప్ప అవకాశం.అంచనాలకు అనుగుణంగా జట్టును నడిపిస్తాను. ప్రతి ఆటగాడికి తమ వంతు బాధ్యత తెలుసు. భారత్‌ను విజేతగా నిలిపేందుకు వారంతా కష్టపడతారు' అని అన్నాడు. కివీస్‌లో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ మ్యాచ్‌లతో స్థానిక వాతావరణానికి అలవాటు పడతామని అన్నాడు.
న్యూజిలాండ్ బయల్దేరడానికి ముందు టీమిండియా సీనియర్ జట్టు కెప్టెన్ అండర్-19 జట్టుతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ టోర్నీ విలువ గురించి చెప్పి వాళ్లలో స్ఫూర్తి నింపాడు. ఇదిలా ఉంటే అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ మూడు సార్లు విజేతగా నిలిచింది. ప్రస్తుత టోర్నీలో ఆస్ట్రేలియా, జింబాబ్వే, పపువా న్యుగినియా జట్లతో కలిసి గ్రూప్ 'బి'లో ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.