
హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్ రాహుల్ ద్రవిడ్ గురువారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఎన్‌సీఏ విధివిధానాల విషయంలో వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ సాగింది.
ఇటీవల టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఫిట్‌నెస్ నిర్వహించేందుకు ఎన్‌సీఏ నిరాకరించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాముఖ్యత సంతరించుకుంది. సమావేశం అనంతరం ద్రవిడ్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించగా, గంగూలీ మాత్రం ఇది సాధారణ సమావేశమేనని తెలిపాడు.
ఈ సమావేశంలో కొత్త సెలెక్షన్ కమిటీతో పాటు క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే బుమ్రాకు ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించేందుకు ఇప్పటికే జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇటీవల గాయంతో జట్టుకు దూరమైన బుమ్రా, పాండ్యా కోలుకోవడానికి ఎన్‌సీఏకు వెళ్లలేదు.
వ్యక్తిగత ట్రైనర్ సాయంతో కోలుకునే ప్రయత్నం చేశాడు. తిరిగి కోలుకున్న బుమ్రా ఫిట్‌నెస్ పరీక్ష కోసం ఎన్‌సీఏకు వెళ్లగా అతడికి పరీక్ష నిర్వహించడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో సౌరవ్ గంగూలీ- రాహుల్ ద్రవిడ్‌లు ఈ భేటీలో ఎన్‌సీఏ విధివిధానాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు గాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన ఫిట్‌నెస్‌ను రంజీల్లో నిరూపించుకోవాల్సిన అవసరం దాదాపు ఉండకపోవచ్చని సమాచారం తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే శ్రీలంక సిరీస్‌లోనే బుమ్రా నేరుగా పునరాగమనం చేయనున్నాడు.
వెన్ను గాయం కారణంగా బుమ్రా గత సెప్టెంబరు నుంచి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. గాయం కారణంగా బంగ్లాదేశ్, వెస్టిండీస్ సిరీస్‌లకు దూరమయ్యాడు. జనవరిలో శ్రీలంకతో టీ20 సిరీస్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ జరగనుంది. గాయం నుంచి కోలుకున్న బుమ్రా ఈ రెండు సిరీస్‌లకు ఎంపికయ్యాడు.
ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి రంజీల్లో గుజరాత్ తరఫున ఆడాల్సి ఉంది. అయితే తన పునరాగమన ప్రక్రియపై బుమ్రా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషాను కలిసినట్లు సమాచారం తెలుస్తోంది. రంజీల్లో పాల్గొనకుండా పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టిసారించమని వారు బుమ్రాకి తెలిపినట్లు సమాచారం.
గంగూలీ, జై షాల నిర్ణయంతో బుమ్రా నేరుగా శ్రీలంక సిరీస్‌లోనే పునరాగమనం చేయనున్నాడు. మరోవైపు రంజీల్లో బుమ్రాతో రోజుకి కేవలం 4 నుంచి 8 ఓవర్లు బౌలింగ్ చేయించాలని సెలక్షన్ కమిటీ చేసిన అభ్యర్థనను గుజరాత్ జట్టు యాజమాన్యం అంగీకరించనట్లు సమాచారం. అలాంటి రాయితీ బౌలింగ్‌ను మేం ప్రోత్సహించలేమని తేల్చి చెప్పిందట.