
జొహాన్నెస్‌బర్గ్: ఆధునిక్ క్రికెట్ హార్డ్ హిట్టర్‌గా, మిస్టర్ 360 డిగ్రీస్‌గా పేరు తెచ్చుకున్న దక్షిణాఫ్రికా మాజీ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్,. ఏబీ డివిలియర్స్ మరోసారి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున ఆడటానికి ఆ దేశ క్రికెట్ బోర్డు సూచనప్రాయంగా అంగీకరించింది. ఏబీ డివిలియర్స్ పునరాగమనానికి అంగీకరిస్తే.. జట్టులో అతని స్థానం సుస్థిరమౌతుందనే సంకేతాలను పంపించింది. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ స్పష్టం చేశారు.
ఈ విషయంపై అతనితో తాను సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టీ20 ప్రపంచ కప్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించబోతోన్న టోర్నీ ఇది. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పపువా న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ జట్లు పాల్గొననున్నాయి.
గత ఏడాదే దీన్ని నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేశారు. ఈ టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ఏబీ డివిలియర్స్‌కు పిలుపు అందింది. అతను జట్టులోకి ఎప్పుడు పునరాగమనం చేసినా.. తాము స్వాగతిస్తామని కోచ్ మార్క్ బౌచర్ స్పష్టం చేశారు. అతని కోసం జట్టు తలుపులు తెరిచే ఉన్నాయని వ్యాఖ్యానంచారు. ప్రస్తుతం ఏబీ డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్‌లో ఆడుతున్నాడని, తాను అతనితో ఆన్‌లైన్ ద్వారా ఛాటింగ్ చేసినట్లు వివరించారు.
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆలోచనలను ఏబీతో పంచుకున్నానని చెప్పారు. ఐపీఎల్ టోర్నమెంట్లలో అతని పెర్‌ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటోందని, అందుకే- రిటైర్ అయినప్పటికీ- జట్టులో చోటు కల్పించాలని బోర్డు భావిస్తున్నట్లు తెలిపారు. జాతీయ జట్టు తరఫున ఆడటానికి డివిలియర్స్ అంగీకరిస్తే.. అతనికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ కావడం వల్ల జట్టు విజయాలను సాధించడానికి అవకాశాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు.