ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికకాని భువీ:
టీమిండియా అద్భుతమైన పేసర్లలో భువనేశ్వర్ కుమార్ ఒకడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పిచ్‌లపై పచ్చిక.. వాతావరణం చల్లగా.. తేమతో వుంటే అతడిని ఆపడం కష్టమే. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తుంటాడు. ఇంగ్లండ్, న్యూజీలాండ్ వంటి దేశాలు భువీ బౌలింగ్‌కు సరిగ్గా సరిపోతాయి. కానీ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్ పర్యటనకు భువీ ఎంపికకాలేదు. టెస్ట్ జట్టును ప్రకటించినప్పటి నుంచి.. సీనియర్ పేసర్ అయినప్పటికీ జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం అతడికి ఎందుకు లేకుండా పోయిందనే దానిపై చాలా చర్చలు జరిగాయి. బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిసింది.

టెస్ట్ కెరీర్‌కు గుడ్ బై అంటూ వార్తలు:
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌పై ఎక్కువ దృష్టి పెట్టడానికి భువనేశ్వర్ కుమార్ టెస్ట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాలనుకుంటుంన్నాడు అని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. భువీకి పరిమిత ఓవర్ల ఫార్మాట్ మాత్రమే ఆడడం ఇష్టమని ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్టు కూడా వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. టెస్ట్ జట్టు నుండి భువీని తప్పించబడటానికి ఇది కూడా ఓ కారణమని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై భువనేశ్వర్ కుమార్ ఘాటుగా స్పందించాడు. సోషల్ మీడియాలో ప్రచురితమైన వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని, ఆలాంటి అసత్య ప్రచారాలు రాయొద్దన్నాడు.

మూడు ఫార్మాట్లలలో ఆడడానికి సిద్ధం:
భువనేశ్వర్ కుమార్ శనివారం ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. 'నాకు టెస్ట్ క్రికెట్ ఆడడం ఇష్టం లేదని సోషల్ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. అందుకే స్పందిస్తున్నా. జట్టు ఎంపికతో సంబంధం లేకుండా.. మూడు ఫార్మాట్లలలో ఆడడానికే నేను ఎప్పుడూ సన్నద్ధం అవుతుంటా. జట్టులోకి ఎంపికయినా.. కాకున్నా ఇదే పద్దతి ఫాలో అయ్యా. ఇకపై కూడా ఇలానే కొనసాగుతా. చివరగా ఓ సలహా.. మీ ఊహాగానాల ఆధారంగా అసత్య ప్రచారాలు రాయొద్దు' అని భువనేశ్వర్ ట్వీట్ చేశాడు. భారత్ తరఫున భువీ 21 టెస్టులు, 117 వన్డేలు, 48 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 246 వికెట్లు పడగొట్టాడు.

2018లో చివరి టెస్ట్:
భువనేశ్వర్ కుమార్ రెండున్నరేళ్లుగా గాయాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. 2018 జనవరి నుంచి భువీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్టే ఆడలేదు. ఆ ఏడాది జనవరి 24-27 మధ్యన దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచే చివరిది. పరిమిత ఓవర్ల క్రికెట్లో డెత్ ఓవర్లలో అతడి సామర్థ్యం పెరగడంతో.. బీసీసీఐ టీ20, వన్డేలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చింది. గతేడాది ఐపీఎల్‌లో గాయపడటంతో కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమయ్యాడు. ఆపై ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్లో అవకాశం ఇచ్చారు. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ లాంటి బౌలర్లు టెస్ట్ ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications
