ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ ఆటగాళ్లు తలపడుతుంటే, కామెంటరీ బాక్సులో ఆయా జట్ల మాజీలు పోటీపడుతున్నారు. తొలి టెస్టులో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యాతలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కామెంటరీలో భాగంగా మాట్లాడుతూ పీటర్సన్ భారత్‌లోని స్పిన్ పిచ్‌ల గురించి నోరు జారాడు. దీంతో అతడిపై గవాస్కర్ మండిపడ్డాడు.
అసలేం జరిగిదంటే.. రెండో రోజు చివరి సెషన్‌లో తొలి రోజు ఆట గురించి చర్చిస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో 55/0తో మెరుగైన స్థితిలో ఉన్న ఇంగ్లాండ్ జడేజా, అశ్విన్ ధాటికి 60/3తో కష్టాల్లో పడింది. దాని గురించి కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ.. ''జడేజా వేసిన తొలి రెండు బంతుల్ని గమనించారా? అది టెస్టు మొదటి రోజు. ఎంతగా టర్న్ అయ్యాయో చూడండి. తొలి రోజే అంతలా అవ్వకూడదు'' అని అన్నాడు.

దానికి గవాస్కర్ బదులిస్తూ.. ''బంతి స్పిన్ అవుతుందా, బౌన్స్ అవుతుందా అని చూడకండి. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఔటైనా తీరును పరిశీలించండి. మిడ్ ఆన్‌లో క్రాలీ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జో రూట్ రివర్స్ స్వీప్ చేసి వెనుదిరిగాడు. మిగిలిన బ్యాటర్ల టెక్నిక్ అసలు బాగోలేదు. అంతగా టర్న్, బౌన్స్ కాలేదు. మీరు భారత్‌లో టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటే తొలి రోజు నుంచే టర్న్ అవుతుందని భావించి ఇక్కడకి రండి. అంతేకానీ నేరుగా బంతులు వస్తాయని అనుకోవద్దు'' అని పేర్కొన్నాడు.
దీంతో పీటర్సన్ కాస్త తగ్గి.. ''స్పిన్‌కు అనుకూలమని ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా భావిస్తున్నారు. అయితే రెండు జట్ల మధ్య తేడా తమ స్పిన్నర్లు సాధించే స్పిన్'' అని అన్నాడు. గొప్ప వ్యాఖ్యాతలు కూడా తటస్థంగా ఉంటూ కామెంటరీ చేయడం కష్టమే అని గవాస్కర్ నవ్వుతూ ఆ చర్చకు ముగింపు పలికాడు. సాధారణంగా వ్యాఖ్యాతలు తటస్థంగా ఉంటూ ఇరు జట్ల ఆటను విశ్లేషిస్తుంటారు. కానీ పీటర్సన్ ఇంగ్లాండ్‌కు మద్దతుగా మాట్లాడటంతో, గవాస్కర్ దీటుగా బదులిచ్చి ఆ డిబేట్‌కు ఎండ్‌కార్డ్ వేశాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 246 పరుగులు చేయగా, టీమిండియా 436 పరుగులు సాధించింది.