అంతా వర్షమే చేసింది: అందువల్లే ఓటమి: పాక్ కేప్టెన్

లాహోర్: సెమీఫైనల్ చేరకుండానే ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడంపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు కేప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్షం వల్లే తాము సరిగ్గా ఆడలేకపోయామని చెప్పారు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం వల్ల తాము రిథమ్‌ను కోల్పోయామని అన్నారు. నెట్ ప్రాక్టీస్ కూడా ఆశించిన స్థాయిలో లేదని చెప్పారు. ఇంగ్లండ్‌పై భారత క్రికెట్ జట్టు ఓటమి పాలు కావడానికి తామే కారణమని ఆరోపించడం అర్థం లేదని ఆయన అన్నారు. ఆతిథ్య జట్టు అద్భుతంగా ఆడిందని చెప్పుకొచ్చారు. ప్రపంచకప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లను ఆడిన ఆ జట్టు స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో- కేప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ విలేరుల సమావేశంలో మాట్లాడారు. జట్టు గెలుపోటములపై గల కారణాలను విశ్లేషించారు.

వరుస విజయాలు సాధించినా..
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ప్రపంచకప్ టోర్నమెంట్ మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు లీగ్ దశలోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. చివరి మ్యాచుల్లో ఆ జట్టు అద్భుతంగా పుంజుకొని ఆడినప్పటికీ.. మెరుగైన రన్‌రేట్‌ను నమోదు చేసుకోలేకపోయింది. ఫలితంగా- మెరుగైన రన్‌రేట్ ప్రాతిపదికన న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్‌లో చోటు దక్కించుకుంది. మంగళవారం ఆ జట్టు తొలి సెమీఫైనల్ ఆడబోతోంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో భారత జట్టును ఢీ కొట్టబోతోంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం అవుతుంది. రెండో సెమీఫైనల్ శుక్రవారం జరుగనుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ఈ మ్యాచ్‌లో పోటీ పడతాయి.

వర్షం వల్ల ఓ మ్యాచ్ రద్దు..
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ మొత్తం తొమ్మిది మ్యాచులను ఆడింది. అయిదింట్లో నెగ్గింది. టీమిండియా సహా మూడు మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. టోర్నమెంట్ ఆరంభంలో వెస్టిండీస్‌తో పరాజయాన్ని చవి చూసిన సర్ఫరాజ్ సేన.. ఆ తరువాత పుంజుకొంది. రెండో మ్యాచ్‌లో బలమైన ఇంగ్లండ్ టీమ్‌ను ఓడించింది. మూడో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. నాలుగు, అయిదు మ్యాచుల్లోనూ ఓడిన ఆ జట్టు.. వరుసగా చివరి నాలుగు మ్యాచుల్లోనూ అనూహ్య విజయాలను అందుకుంది. రన్‌రేట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఇతర జట్ల గెలుపోటములు, సమీకరణాలపై ఆధాపడాల్సి వచ్చింది పాకిస్తాన్‌కు. ఫలితంగా- ఇంటిదారి పట్టింది.

మూడో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం వల్లే మలుపు
రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన తాము ఇక అన్ని మ్యాచ్‌లను గెలుస్తామనే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నామని అన్నారు. వర్షం వల్ల మూడో మ్యాచ్ రద్దు కావడంతో తాము రిథమ్ కోల్పోయామని, నెట్ ప్రాక్టీస్ సరిగ్గా చేయలేకపోయామని సర్ఫరాజ్ వివరించారు. దీని ఫలితం వల్ల వరుసగా రెండింట్లో ఓడిపోయామని అన్నారు. చివరి నాలుగు మ్యాచ్‌లను తాము వరుసగా గెలుస్తూ వచ్చామనే విషయాన్ని ఎవరూ విస్మరించకూడదని చెప్పారు. ఆశించిన దానికంటే తాము మెరుగ్గా ఆడామని అన్నారు. ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వంటి బలమైన టీమ్‌లపై తాము విజయం సాధించామని గుర్తు చేశారు.

ఇంగ్లండ్‌పై టీమిండియా ఓటమిపై..
ఇంగ్లండ్‌పై భారత క్రికెట్ జట్టు ఓడిపోవడానికి, తమకు ఎలాంటి సంబంధం లేదని సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. భారత జట్టు ఓటమికి తాము ఎలా కారణమయ్యారనే విషయంపై సాంకేతికంగా సరైన వివరాలు అందించగలరా? అని ఆయన ప్రశ్నించారు. తమను సెమీఫైనల్ చేరకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే టీమిండియా కావాలనే ఇంగ్లండ్‌పై ఓడిపోయిందని తాను అనుకోవట్లేదని అన్నారు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అద్భుతంగా ఆడిందని, ఎలాంటి జట్టయినా ఆ మ్యాచ్‌లో ఓటమి చవి చూసి ఉండేదని సర్ఫరాజ్ చెప్పారు.

రాజీనామా బోర్డు చేతిలో..
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో జట్టు ప్రదర్శన బాగున్నప్పటికీ.. తాను కేప్టెన్సీ నుంచి వైదొలగాలంటూ డిమాండ్లు వస్తున్నాయని, దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డే ఓ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికిప్పుడు రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. బోర్డు ఆదేశిస్తే- కేప్టెన్సీని వదులుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications