
తెరపైకి నెపోటిజమ్:
ఐపీఎల్ 2021 వేలంలో అర్జున్ టెండుల్కర్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బంధుప్రీతి కారణంగానే అర్జున్‌కు ఈ అవకాశం వచ్చిందంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సచిన్ కొడుకు కావడంతోనే అర్జున్‌ని ముంబై కొనుగోలు చేసిందని మరికొందరు ఆరోపిస్తూ.. నెపోటిజమ్ ట్యాగ్‌ని తెరపైకి తెచ్చారు. ఇక నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు నిరసనల విషయంలో అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై సచిన్ స్పందించిన విధానానికి, అర్జున్ ఐపీఎల్ అరంగేట్రాన్ని ముడిపెడుతూ విమర్శిస్తున్నారు.
అర్జున్ ఉత్సాహాన్ని మర్డర్ చేయకండి:
ఈ విషయంపై ఫర్హాన్ అక్తర్ స్పందిస్తూ... 'అర్జున్ టెండుల్కర్ గురించి ఒక విషయం చెప్పాలి. మేమిద్దరం ఒకే జిమ్‌లో ఎప్పటికి కలుస్తూ ఉంటాం. ఫిట్‌నెస్ సాధించేందుకు అతడు ఎంతో శ్రమిస్తాడు. మంచి క్రికెటర్‌గా ఎదిగే అంశాలపై దృష్టి పెడతాడు. అలాంటి అర్జున్‌పై నెపోటిజమ్ పేరుతో ఆపాదించడం సమంజసం కాదు. అంతకంటే క్రూరమైంది మరొకటి లేదు. క్రికెటర్‌గా కెరీర్ ప్రారంభించక ముందే.. అతని ఉత్సాహాన్ని మర్డర్ చేయకండి' అని ట్విటర్ వేదికగా అర్జున్‌కు మద్దతు ప్రకటించాడు.

స్పదించిన సారా:
సచిన్ కుమార్తె, అర్జున్ సోదరి సారా టెండుల్కర్ సైతం ఈ విషయంపై స్పదించారు. 'నువ్వు సాధించిన ఈ ఘనతను.. నీ నుంచి ఎవరూ తీసుకోలేరు. ఇది నీది. క్రికెట్ అనేది తన రక్తంలోనే ఉంది. ఇన్నాళ్లూ నెట్స్‌లో సాధన చేసి మేటి క్రికెటర్‌గా ఎదిగాడు. ఇప్పుడిక 22 గజాలపై తుఫాన్ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు' అని సారా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు. ఇక ప్రతిభ ఆధారంగానే అర్జున్‌ను తాము ఎంపిక చేసుకున్నట్లు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్దనే తెలిపిన సంగతి తెలిసిందే.

ఐదు సిక్సర్లు బాది:
ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ముంబై సీనియర్ టీమ్‌కి ఆడిన అర్జున్ టెండూల్కర్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు. అయితే తాజాగా జరిగిన పోలీస్ ఇన్వేషన్ షీల్డ్ క్రికెట్ టోర్నమెంట్‌లో.. జింఖానా జట్టుపై కేవలం 31 బంతుల్లోనే 77 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది వార్తల్లో నిలిచాడు. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు తీశాడు. అర్జున్ చెలరేగడంతో జింఖానా జట్టుపై ఎంఐజీ 194 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.


Click it and Unblock the Notifications












