న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ నుంచి తన ప్రియురాలికి గాల్లో ముద్దులు ఇవ్వడంపై భారత్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందిస్తూ తనకెలాంటి అభ్యంతరాలు లేవన్నాడు. అయితే భారీగా స్కోర్లు సాధించినప్పుడు మాత్రమే ఫ్లైయింగ్ కిస్ ఇవ్వాలని అన్నారు.
వివరాల్లోకి వెళితే ఓ హిందీ న్యూస్ ఛానల్ నిర్వహించిన "క్రికెట్ కాన్‌క్లేవ్"లో కపిల్ సరదాగా మాట్లాడారు. 'విరాట్ కోహ్లి సెంచరీ చేసి ప్రియురాలికి గాల్లో ముద్దు విసిరితే నాకేం అభ్యంతరం లేదు. కానీ జీరో పరుగులు చేసి గాల్లో ముద్దులు పెడితేనే ఇబ్బంది. మేము క్రికెట్ ఆడినప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. మేము వీటిని అంగీకరిస్తాం' అని కపిల్ చెప్పారు.

"ఎక్కడో కూర్చుని క్రికెట్ ఎక్కువ కాలం జెంటిల్మన్ గేమ్ కాదు అని చెప్పలేం. మేము టెస్టు క్రికెట్‌తో ఎదిగాం. కానీ ఇప్పుడు స్లెడ్జింగ్, వేధింపులు ఎక్కువగా కలిగిన టీ20 ఫార్మెట్‌ను అంగీకరించారు" అని కపిల్ తెలిపారు.
మ్యాచ్ ఆరంభానికి ముందు టీమిండియా ఆటగాళ్లు గుంపుగా ఆలింగనం ఎందుకు చేసుకుంటున్నారో అర్థంకావడం లేదని అన్నారు. 'డ్రెస్సింగ్ రూములో ఏం చేస్తున్నారు. కోడిగుడ్లు మాత్రమే తింటున్నారా' అని ప్రశ్నించారు.
భారత్ ప్రపంచకప్ గెలిచే అవకాశాలు 25 శాతం మత్రమే ఉన్నాయని కపిల్ చెప్పారు. నేను ప్రారంభం చాలా ముఖ్యమైనదిగా నమ్ముతానని చెప్పారు. మొదటి 15 ఓవర్లు భారత్ యొక్క గెలుపుఓటములను నిర్ణయిస్తాయని చెప్పారు.