కోల్‌కత్తా: బీసీసీఐ అడ్వైజరీ కమిటీలో ప్రస్తుతానికి తన పాత్రమిటో తెలియదని సౌరభ్ గంగూలీ అన్నారు. టీమిండియాను నడిపించిన దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లకు బీసీసీఐ అడ్వైజరీ కమిటీ చోటు కల్పిస్తూ బీసీసీఐ సోమవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా గంగూలీ విలేకరుల అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాకు ఇప్పుడే కమిటీ గురించి తెలిసింది. అయితే, అందులో నేనేం చేయనున్నానో నాకైతే తెలియదు. అయితే సచిన్, లక్ష్మణ్‌లతో కలసి పనిచేయనుండడటం సంతోషంగా ఉందని అన్నాడు.

ఇక అడ్వైజరీ కమిటీలో బీసీసీఐ స్ధానం కల్పించడం పట్ల హైదరాబాదీ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశాడు. భారత క్రికెట్‌కు సేవ చేసేందుకు ఇదో గొప్ప అవకాశమని తెలిపాడు. సచిన్, గంగూలీ లాంటి గొప్ప ఆటగాళ్లతో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టమని అన్నాడు.
ప్రస్తుతం వీవీఎస్ లక్ష్మణ్ బెంగాల్ క్రికెట్ సంఘానికి సలహాదారుగా వ్వవహారిస్తున్నాడు. కోల్‌కత్తాలోని బెంగాల్ యువ ఆటగాళ్లకు మెళకువలు నేర్పుతున్నాడు. అంతేకాదు క్రికెట్ ఆసోసియేషన్ ఆప్ బెంగాల్ (క్యాబ్) విజన్ 2020 ప్రాజెక్టులో సభ్యుడిగా వీవీఎస్ లక్ష్మణ్ ఉన్న విషయం తెలిసిందే.