
హైదరాబాద్: పాకిస్థాన్ జట్టుని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు తన వంతు ప్రయత్నాలను చేస్తున్నానని హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్ తెలిపాడు. ఈ ప్రయత్నంలో విఫలమైతే తనంతట తానే పదవి నుంచి దిగిపోతానని తెలిపాడు. పాకిస్థాన్ క్రికెట్‌ను వెంటనే చక్కదిద్దేందుకు తనవద్ద మంత్రదండం ఏమీ లేదని అసహనం వ్యక్తం చేశాడు.
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన తర్వాత మిస్బా ఉల్ హాక్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నట్టుగా మీరు పదవి నుంచి దిగిపోతారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా 'మీకు ఏం కావాలి' అని మిస్బా అసహనం వ్యక్తం చేశాడు.
"నా వద్ద మంత్రదండం లేదని మీరు గ్రహించాలి. ఆటగాళ్ళు స్థిరపడటానికి మరియు మంచి ప్రదర్శించడానికి ఒక ప్రక్రియ అవసరం. పాక్ క్రికెట్ జట్టు ఎప్పుడో ఓసారి ఆడితే కూర్చొని చూడాలని నాకేమీ లేదు. దానినెవరూ ఇష్టపడరు. నా బదులు ఇంకెవరైనా అది చేయొచ్చు. నేను నిజాయతీగల వ్యక్తిని" అని మిస్బా చెప్పుకొచ్చాడు.
"ప్రస్తుత టెస్టు జట్టును తీర్చిదిద్దేందుకు అత్యుత్తమంగా పనిచేస్తున్నాను. విమర్శకులను నేను ఆపలేను. నా వరకైతే గుండెల్లో ఏముందే అదే చెప్పాలి. సెలక్టర్, కోచ్‌గా నా బాధ్యతలపై స్పష్టత ఉంది. జట్టును నిర్మించేందుకు అందరి సాయం తీసుకుంటున్నా" అని మిస్బా పేర్కొన్నాడు.