
వరుస విజయాలను నమోదు చేసిన కోహ్లీసేన
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత వెస్టిండీస్, శ్రీలంకలో పర్యటించిన టీమిండియాకు ప్రత్యర్ధి జట్లు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాయి. అనంతరం భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌పై కోహ్లీసేన మూడు సిరిస్‌లలో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత కోహ్లీసేన వరుస విజయాలను నమోదు చేసింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది టీమిండియా ఎదుర్కొన్న వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా కెప్టెన్ బెంగళూరు వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో డీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకునే ముందు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడటం పెద్ద వివాదానికి దారి తీసింది.

బెంగుళూరు టెస్టులో స్మిత్ డీఆర్ఎస్ వివాదం
మ్యాచ్ అనంతరం అప్పటికే రెండు సార్లు స్మిత్ అలా సాయం తీసుకోవడం తాను చూశానని మీడియా సమావేశంలో కోహ్లీ చెప్పడంతో ఆస్ట్రేలియా మీడియా కోహ్లీపై తన అక్కసు వెళ్లగక్కింది. ఒకానొక దశలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కోహ్లీని పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ వివాదం ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ-అనిల్ కుంబ్లే మధ్య నెలకొన్న విభేదాలు మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. భారత్ జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేసిన అనిల్ కుంబ్లే తమతో హెడ్‌మాస్టర్‌లా వ్యవహరిస్తున్నాడంటూ జట్టులోని సీనియర్ ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు.

కుంబ్లే-కోహ్లీ వివాదం
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ప్రాక్టీస్ సెషన్‌లో కుంబ్లేపై కోహ్లీ నోరు జారినట్లు కూడా అప్పట్లో వార్తలు వెలుగుచూశాయి. దీంతో మనస్థాపానికి గురైన కుంబ్లే.. మరోసారి కోచ్‌గా ఎంపికయ్యే అవకాశం ఉన్నప్పటికీ కోచ్ బాధ్యల నుంచి తప్పుకున్నాడు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య కుంబ్లే స్ధానంలో కోచ్ బాధ్యతలను రవిశాస్త్రి స్వీకరించాడు. 2019 వరల్డ్ కప్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఏడాది యువ క్రికెటర్లకు సెలక్టర్లు ఎక్కువ అవకాశాలు కల్పించారు. కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్ లాంటి ఆటగాళ్లు ఇప్పటికే సత్తా చాటుతున్నారు.

తెరపైకి యువ అల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా
ఇక్కడ యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతేడాది జట్టులో చోటు దక్కించుకున్న హార్దిక్ పాండ్యా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మెరుపులు మెరిపిస్తూ.. లోయర్ మిడిలార్డర్ నమ్మదగిన బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు. జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్‌లు.. సీనియర్ స్పిన్నర్లు అయిన రవీంద్ర జడేజా, అశ్విన్ స్థానాల్ని భర్తీ చేశారు.

రోహిత్ శర్మ డబుల్ సెంచరీ
మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ సాధించడంతో రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దీంతో పాటు రోహిత్ శర్మ వన్డేల్లో ఒక ఏడాది అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో కూడా చేరాడు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 9 సెంచరీలతో అగ్రస్ధానంలో ఉండగా... రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 6 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు.
ఒక ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు:
* సచిన్ టెండూల్కర్ - 1998లో 9 సెంచరీలు, 1996లో 6 సెంచరీలు
* సౌరవ్ గంగూలీ - 2000లో 7 సెంచరీలు
* రాహుల్ ద్రవిడ్ - 1999లో 6 సెంచరీలు
* విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ - 2017లో 6 సెంచరీలు

టెస్టుల్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు
ఈ ఏడాది విరాట్ కోహ్లీ టెస్టుల్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేశాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్ధానంలో నిలిచాడు. వన్డేల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. 28 ఏళ్ల కోహ్లీ ఇప్పటికే 32 సెంచరీతో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఇక, టీమిండియా మాజీ కెప్టెన్ ఎక్కువ మందిని ఔట్ చేసిన వికెట్ కీపర్‌గా ఈ ఏడాది అరుదైన ఘనత సాధించాడు. స్పిన్నర్ చాహల్ ఈ ఏడాదిలోనే ఎక్కువ టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది స్వదేశంలో ఒక్క వన్డే సిరీస్‌లో కూడా టీమిండియా ఓడిపోలేదు.

వన్డేల్లో 4000 పరుగులు చేసిన శిఖర్ ధావన్
ఇక, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డేల్లో 4000 పరుగుల మైలురాయిని సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ధావన్‌కి ముందు విరాట్ కోహ్లీ (93 ఇన్నింగ్స్)ల్లో ఈ ఘనత సాధించగా ధావన్ 95 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో వరుసగా తొమ్మిది సిరీస్‌లు విజయాలు సాధించి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ రికార్డులను సమం చేసింది. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో గనుక కోహ్లీ సేన విజయం సాధిస్తే ప్రపంచ రికార్డుని నెలకొల్పుతుంది. ఈ ఏడాది ఐసీసీ ర్యాంకుల్లో టెస్టుల్లో అగ్రస్థానం.. వన్డేల్లో రెండో స్థానం, టీ20ల్లో టాప్-5లో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications












