For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐకి అసలు సిగ్గుందా?

Asia Cup 2025: రాబోయే ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్‌‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై శివసేన(యూబీటీ) నాయకుడు ఆదిత్య థాక్రే చేసిన వ్యాఖ్యలు రాజకీయ,క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. నిరంతరం కొనసాగుతున్న ఉగ్రవాద బెదిరింపుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది.

దుబాయ్‌లో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ తో ఆడటానికి బీసీసీఐ అంగీకరించింది. దీనిపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌‌సుఖ్ మాండవీయకు ఆదిత్య థాక్రే ఒక లేఖ రాశారు. ఆ లేఖలో "పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదం కొనసాగుతుండగా.. మన సైనికులు, ప్రజలు ప్రభావితమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సిగ్గు లేకుండా బీసీసీఐ పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటానికి జట్టును ఎందుకు పంపిస్తోంది?" అని ఆయన ప్రశ్నించారు. డబ్బు, ప్రకటనల ఆదాయం కోసం బీసీసీఐ మన సైనికుల త్యాగాలను, ఉగ్రవాద దాడులలో బాధితుల వేదనను తక్కువగా అంచనా వేస్తోందా? దేశ ప్రయోజనాల కంటే బీసీసీఐ పెద్ద సంస్థగా మారిందా? అంటూ ఆయన విమర్శించారు. దేశ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

Does BCCI Have Any Shame Aaditya Thackeray Slams India-Pakistan Match in Asia Cup 2025

పాకిస్థాన్ హాకీ జట్టు భద్రతా కారణాల వల్ల భారత్ లో ఆడటానికి నిరాకరించిన విషయాన్ని ఆదిత్య థాక్రే గుర్తు చేశారు. "ఒకవైపు వారు మన దేశానికి రావడానికి భయపడుతున్నారు, కానీ మనం స్వార్థం కోసం వారితో ఆడటానికి సిద్ధపడటం సిగ్గుచేటు" అని ఆయన పేర్కొన్నారు. ఆదిత్య థాక్రే తన సోషల్ మీడియా పోస్టులో "రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవని మన ప్రధాని ఎర్రకోటలో చెబుతున్నారు. కానీ బీసీసీఐకి మాత్రం రక్తం, ఆదాయం కలిసి ప్రయాణించగలవా?" అని ఘాటుగా విమర్శించారు.

ఆదిత్య థాక్రే చేసిన ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం కూడా ఉంది. శివసేన పార్టీ ఎప్పటినుంచో పాకిస్థాన్‌తో క్రికెట్, సాంస్కృతిక సంబంధాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. గతంలో కూడా పాకిస్థాన్ ఆటగాళ్లు ముంబైలో ఆడే మ్యాచ్‌లను శివసేన కార్యకర్తలు అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఆసియా కప్ అనే ఓ అంతర్జాతీయ టోర్నమెంట్.. ఇందులో ఆడేందుకు బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నియమాలకు కట్టుబడి ఉంటుంది. అయితే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లను క్రికెట్‌ను మించిన ఒక భావోద్వేగ అంశంగా చాలా మంది చూస్తారు. ఈ నేపథ్యంలో ఆదిత్య థాక్రే చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక మ్యాచ్‌పైనే కాకుండా.. భారత విదేశాంగ విధానం, క్రికెట్ పాలనపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఆసియా కప్ 2025 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. ఇందులో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 14, 21 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు ఇంకా కొన్ని వారాలు ఉండగానే, ఆదిత్య థాక్రే వ్యాఖ్యలు ఈ మ్యాచ్‌లపై రాజకీయ ఒత్తిడిని పెంచుతాయా అనేది వేచి చూడాలి.

Story first published: Thursday, August 21, 2025, 10:13 [IST]
Other articles published on Aug 21, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+