Train Hijack: ప్రస్తుతం పాకిస్థాన్, ఆ దేశ ప్రావిన్స్ బలోచిస్థాన్.. ఈ రెండూ వార్తల్లో చర్చనీయాంశంగా మారాయి. అందుకు కారణం ట్రైన్ హైజాక్. పాకిస్థాన్‌లోని వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు ప్రయాణికుల రైలును హైజాక్ చేయడంతో.. ఈ సంఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడీ సంఘటన భారత క్రికెట్ వర్గాల్లోనూ మరింత తీవ్ర చర్చకు దారీ తీసింది. ఎందుకంటే రీసెంట్ గా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్ లోనే జరగడమే ఇందుకు కారణం. కానీ భారత ఆటగాళ్లు మాత్రం తమ మ్యాచుల వరకు దుబాయ్ లోనే ఆడి విజయంతో ముగించారు. భద్రతా కారణాల వల్ల మన ప్రభుత్వం భారత జట్టును అక్కడికి పంపించలేదు.
అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మన ఆటగాళ్లు పాకిస్థాన్ వెళ్లి ఉంటే, అదే సమయంలో అలాంటి హైజాక్ సంఘటన చోటు చేసుకుని ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేదా? అని భారత క్రికెట్ అభిమానులు ఊహించుకుంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మనోళ్లు పాకిస్థాన్ కు వెళ్లకపోవడమే మంచిది అయిందని అంతా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో మరికొంతమంది క్రికెట్ అభిమానులు.. ట్రైన్ హైజాక్ అయిన బలోచిస్థాన్‌లో ఏమైనా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలు ఉన్నాయా? మ్యాచులు ఏమైనా జరిగాయా? అసలు టీమిండియా ప్లేయర్స్ గతంలో అక్కడ ఎప్పుడైనా ఆడారా? అని ఆరా తీస్తున్నారు. వాటికి సమాధానాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటివరకు ఎన్ని మ్యాచులు జరిగాయి?
ఆయూబ్, బుగ్టి స్టేడియాల్లో మొత్తంగా కలిపి 3 వన్డే మ్యాచులు జరిగాయి. రెండు వన్డే మ్యాచులు ఆయూబ్ స్టేడియంలో జరగగా, మరొకటి బుగ్టి మైదానంలో నిర్వహించారు. ఆ రెండు మైదానాల్లోనూ 1996 తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచులు జరగలేదు.
భారత్ ఎన్ని మ్యాచులు ఆడిందంటే?
బలోచిస్థాన్ లో భారత జట్టు రెండు వన్డే మ్యాచులు ఆడింది. ఆయూబ్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ పాకిస్థాన్ పై ఆడింది. 1978 అక్టోబర్ 1వ తేదీన ఈ మ్యాచ్ నిర్వహించారు. ఈ పోరులో 4 పరుగులు తేడాతో విజయం సాధించిన భారత జట్టుకు బిషాన్ సింగ్ బేడీ నాయకత్వం వహించారు. 51 పరుగులు సాధించడంతో పాటు 2 వికెట్లు తీసిన మోహిందర్ అమరనాథ్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డును అందుకున్నారు. ఈ మ్యాచ్ తోనే దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ వన్డే అరంగేట్రం చేశారు.
ఆయూబ్ స్టేడియంలోనే రెండో వన్డే మ్యాచ్ ను 1984 అక్టోబర్ 12న ఆడింది భారత్. సునీల్ గావస్కర్ అప్పుడు నాయకత్వం వహించారు. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ 46 పరుగులు తేడాతో గెలిచింది. ఇక మూడో మ్యాచ్ పాకిస్థాన్ - జింబాబ్వే మధ్య 1996 అక్టోబర్ 30న బుగ్టి స్టేడియం వేదికగా జరగగా.. ఇందులో పాక్ జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఇదే బుగ్టి స్టేడియంలో మొదటి, ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్.
