హైదరాబాద్: బంగ్లాదేశ్ బౌలర్ టస్కీన్ అహ్మద్ ఓ వింత పరిస్థితిన ఎదుర్కొంటున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరిస్ ముగిసిన తర్వాత 22 ఏళ్ల అహ్మద్ తన చిన్ననాటి స్నేహితురాలైన సయిదా రబీయా నయీంను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అతడి పెళ్లి అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.
సోషల్ మీడియాలో అహ్మద్ అభిమానులపై అతడిపై మండిపడుతున్నారు. 'ప్రేమ గుడ్డిది. నీ భార్య మాకు నచ్చలేదు బ్రో. నువ్వేమో హ్యాండ్సమ్‌గా ఉంటావ్. తనేం బావుంది. అయినా నీ పెళ్లికి బోలెడు టై ఉంది. అప్పుడే ఎందుకు పెళ్లాడావ్. దక్షిణాఫ్రికా చేతిలో జట్టు చిత్తుగా ఓడిపోతే నువ్వేమో పెళ్లి చేసుకుంటావా? మన జట్టుకు మరింత అండగా ఉండాలి కదా' అని ఓ అభిమాని అహ్మద్ పెళ్లి ఫొటో పోస్ట్ కింద కామెంట్ పెట్టాడు.
'పరీక్షల్లో ఫెయిల్ అయితే అమ్మాయిలకు పెళ్లి చేస్తారని తెలుసు గానీ, క్రికెట్లో దారుణంగా ఆడితే అబ్బాయిలకు కూడా పెళ్లి చేస్తారని ఇప్పుడే తెలిసింది' అని మరో అభిమాని కామెంట్ పోస్టు చేశాడు. 'దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడినందుకు మీ నాన్న నీకు సరైన పనిష్మెంట్ ఇచ్చాడు పో' అని మరో అభిమాని కామెంట్ పెట్టాడు.
'మీ ఆవిడ ఆఫ్రికన్‌లా ఉంది. అప్పుడే పెళ్లి చేసుకున్న అహ్మద్‌ను ఇష్టపడే అమ్మాయిల కోసం పది సెకన్లపాటు నిశ్శబ్దం పాటిద్దాం' అని ఓ నెటిజన్ తన జాత్యాహంకారాన్ని ప్రదర్శించాడు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలపై అహ్మద్ తనదైన శైలిలో స్పందించాడు.
ఏడేళ్లుగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని ధైర్యంగా చెప్పాడు. అంతేకాదు క్రికెట్లో ఓడితే పెళ్లి చేసుకోకూడదా? అని ప్రశ్నించాడు. ఇలాంటివి పట్టించుకోవద్దని తన భార్యకు చెప్పాడు. ఇంత చిన్న వయసులో పెళ్లి ఏంటని అడిగితే.. 'ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా. ఇంట్లోవాళ్లు చేసుకోమన్నారు. చేసుకున్నా' అని బదులిచ్చాడు.