గ్రేటర్ నోయిడా: స్వదేశంలో త్వరలో న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో చోటు దక్కకపోవడంపై తాను నిరాశచెందినట్లు భారత సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ఇటీవలి వెస్టిండీస్ పర్యటనకు ఎంపికైన 17 మందిలో బిన్నీ, శార్దుల్ ఠాకూర్‌కు ఉద్వాసన పలికి చివరికి 15మంది తో జట్టును ప్రకటించారు.
కాగా, ఇందులో ఫామ్‌లేమితో ఘోరంగా సతమతమవుతున్న రోహిత్‌శర్మ, శిఖర్ ధావన్‌లకు సెలెక్టర్లు అవకాశమివ్వగా, ఫామ్‌లో ఉన్న గంభీర్‌కు మాత్రం మొండిచేయి చూపారు. దీనిపై ట్విట్టర్ వేదికగా గౌతమ్ తన అసంతృప్తి వ్యక్తం చేశాడు.

'నేను చాలా నిరాశచెందాను, కానీ ఓడిపోలేదు. నన్ను కార్నర్ చేస్తున్నారు, అయినా భయపడేంతా పిరికిపందను కాను. భారత జట్టులో స్థానం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటా' అని గంభీర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. కాగా, గంభీర్ ట్వీట్‌కు స్పందించిన అభిమానులు అతనికి మద్దతుగా నిలిచారు. సెలెక్టర్లు, టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలోనూ గంభీర ఉత్తమ ఫాంతో రాణిస్తుండటం గమనార్హం. ఈ ట్రోఫీలో వరుసగా నాలుగు అర్ధ శతకాలు సాధించాడు గంభీర్. అయినా, బిసిసిఐ సెలెక్టర్లు గౌతంను విమర్శించడం చర్చనీయాంశంగా మారింది.
కోహ్లీపై అభిమానుల ఆగ్రహం
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముఖ్యంగా సీనియర్ ఆటగాడు గౌతం గంభీర్‌ను పక్కనబెట్టి మరీ ఫాంలోని లేని శిఖర్ ధావన్, రోహిత్ శర్మలను జట్టులోకి తీసుకోవడం మాజీ క్రికెటర్లను విస్మయ పరిచింది. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో మంచి ఫామ్‌ను ప్రదర్శిస్తున్న గంభీర్‌కు అవకాశం కల్పించకపోవడం సహజంగానే టీమిండియా అభిమానుల్ని నిరాశ పరిచింది.
తనకు ఇష్టులైన రోహిత్, ధావన్‌లకు చాన్స్ ఇచ్చేందుకే విరాట్ కోహ్లి సీనియర్ ఆటగాళ్లను పట్టించుకోవడం లేదని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్ప ఆటగాడైన కోహ్లీ వ్యక్తిగత ఈర్ష్యద్వేషాలను పక్కనబెట్టాలని, సొంతగడ్డపై జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా రాణించాలంటే ధావన్ కన్నా గంభీర్‌ను తీసుకోవడం మంచిదని పలువురు సూచించారు.