వెస్డిండీస్ విజయాలు చరిత్రకే పరిమితమా ..?

హైదరాబాద్: వెస్టిండీస్.. ఆ పేరే ఒక ఫైర్. ఆధిపత్యానికి మారుపేరుగా నిలిచి కొన్నాళ్ల పాటు ప్రపంచ క్రికెట్‌ను ఏలింది. అలాంటి వెస్టిండీస్ క్రికెట్ గత వైభవాన్ని కోల్పోయి దశాబ్దాలే గడిచిపోయాయి. రెండుసార్లు వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడి.. ఒకసారి రన్నరప్‌గా నిలిచిన కరీబియన్ జట్టు.. ఇప్పుడు తొలిసారి ప్రపంచకప్‌నకు అర్హత సాధించేందుకు తీవ్ర కసరత్తులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికోసం పసికూనలతో సైతం పోటీపడేందుకు ఈ టోర్నీకి సిద్దమైంది.
క్రిస్ గేల్ లాంటి స్టార్లు ఉన్న విండీస్ జట్టు ఆదివారం హరారే వేదికగా ప్రారంభమయ్యే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ టోర్నీలో పాల్గొనబోతోంది. ఈ క్వాలిఫయర్స్ ఆడుతున్న అతి పెద్ద జట్టు విండీసే. ఇన్నాళ్లూ ఎలాగోలా టాప్-10లో ఉంటూ ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తూ వచ్చిన కరీబియన్ బృందం.. ఈసారి ర్యాంకుల్లో పడిపోవడంతో అర్హత పోటీలు ఆడక తప్పని పరిస్థితి వచ్చింది.

విండీస్‌కు తిప్పలు మొదలా..?:
ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తోన్న 2019 ప్రపంచకప్‌కు అర్హత సాధించాలని వెస్టిండీస్ జట్టు పరితపిస్తోంది. నిజానికి 2007 ప్రపంచకప్‌లో 16 జట్లు పాల్గొనగా, 2011, 2015లో 14 జట్లు పాల్గొన్నాయి. అయితే ఐసీసీ 2019, 2023కు గాను జట్ల సంఖ్యను పదికి కుదించడంతో విండీస్‌కు తిప్పలు మొదలయ్యాయి. ఐసీసీ వన్డే చాంపియన్‌షిప్‌లో సెప్టెంబర్ 30,2017 వరకు అగ్రస్థానంలో ఉన్న 8జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. అవి భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు.

పది పసికూనలతో:
10 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడుతున్న ఈ టోర్నీలో విండీస్ గ్రూప్-ఎలో ఉంది. జింబాబ్వేలో మార్చి 4 నుంచి 25 వరకు జరుగనున్న ఈ పోటీల్లో పాల్గొనే జట్లు: 1) వెస్టిండీస్ 2) ఆఫ్ఘనిస్థాన్ 3) జింబాబ్వే 4) ఐర్లండ్ 5) స్కాట్లాండ్ 6) నేపాల్ 7) నెథర్లాండ్స్ 8) హాంకాంగ్ 9) యూఏఈ 10)పపువా న్యూగినియా. ఈ నెల 6న తన తొలి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది. గ్రూప్-బిలో జింబాబ్వే కూడా ఉంది. ఈ గ్రూపులో అఫ్గానిస్తాన్ బలమైన జట్టుగా బరిలో దిగుతోంది.

వెస్టిండీస్ చరిత్ర:
1975లో తొలిసారి క్రికెట్ ప్రపంచకప్ జరుగగా క్లెవ్ లాయిడ్ నాయకత్వంలోని వెస్టిండీస్ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో క్లెవ్ లాయిడ్ 82 బంతుల్లోనే సెంచరీ చేసి దూకుడుకు నిర్వచనం చెప్పాడు. ఆ తర్వాత 1979లోనూ ఇంగ్లండ్‌పై గెలిచి రెండోసారి జగజ్జేతగా నిలిచింది. 1983లో కపిల్‌దేవ్ సారథ్యంలోని భారత్, వెస్టిండీస్ హ్యాట్రిక్ కలలను చెరిపేసి విజేతగా అవతరించింది. అప్పటి నుంచి వెస్టిండీస్ ప్రపంచకప్‌కు దూరంలోనే నిలిచింది. 1996లో సెమీఫైనల్, 2011, 15లో క్వార్టర్ ఫైనల్స్ మినహా మిగతా ప్రపంచకప్ టోర్నీల్లో గ్రూప్ దశకే పరిమితమైంది.

టీ20 లీగ్స్ పుణ్యమా అని:
ఇప్పటి వరకు జరిగిన అన్ని (11) ప్రపంచకప్ టోర్నీల్లోనూ విండీస్ ఆడింది. లాయిడ్, రిచర్డ్స్ తర్వాత లారా, ఆంబ్రోస్, వాల్ష్ వంటి సూపర్‌స్టార్లు ప్రత్యర్థులను వణికించారు. ఆ తర్వాత క్రిస్‌గేల్, బ్రావో, పొలార్డ్ వంటి మెరుపు వీరులు అదురగొడుతున్నా టీ20 లీగ్స్ పుణ్యమా అని ఆ జట్టుకు బీటలువారాయి. దీనికి తోడు జీతాలు, కాంట్రాక్టుల కోసం విండీస్ బోర్డుపై క్రికెటర్లు యుద్ధం చేశారు. ఫలితంగా ఆ జట్టు గందరగోళంగా తయారైంది.

గేల్ పైనే అన్ని ఆశలు:
క్రిస్‌గేల్,శామ్యూల్స్‌ను జట్టులోకి తీసుకున్నా .. పొలార్డ్, నరైన్, బ్రావో, రస్సెల్ వంటి మ్యాచ్ విన్నర్లను పక్కన పెట్టింది. జాసన్ హోల్డర్ సారథ్యంలోని విండీస్‌లో బ్రాత్‌వైట్, బిషూ, ఎవిన్ లూయిస్ తప్ప చెప్పుకోదగ్గ ఆటగాళ్లెవరూ లేకపోవడం ఆ జట్టు క్వాలిఫయింగ్ ఆశలను దెబ్బతీసే అవకాశం ఉంది. 2017లో వెస్టిండీస్ 22 వన్డేలు ఆడి కేవలం 3 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇందులో గేల్ ఆరు మ్యాచ్‌ల్లోనే ఆడాడు. అయితే అర్హత పోటీల్లో గేల్ తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తే విండీస్‌కు ప్రపంచకప్ బెర్త్ ఖాయం.

పసికూనలే అనుకుంటే తప్పే:
ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వే, ఐర్లాండ్ జట్లతో విండీస్‌కు గట్టి పోటీ ఎదురవనున్నది. స్పిన్ బౌలర్ రషీద్‌ఖాన్, జర్దాన్, నబి, షెహజాద్ వంటి కీలక ఆటగాళ్లు ప్రత్యర్థులకు సవాల్‌గా మారనున్నారు. ఇక 2015 ప్రపంచకప్‌లో విండీస్‌కు షాకిచ్చిన ఐర్లాండ్ మరోసారి ప్రతాపం చూపెట్టాలని ఉవ్విళ్లూరుతుంది. సొంతగడ్డపై ఆడటం జింబాబ్వేకు అనుకూలించే విషయం. ఐపీఎల్ వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన లెగ్ స్పిన్నర్ సందీప్ లమిచ్చానే నేపాల్ జట్టులో కీలకం కానున్నాడు.
ట్రోఫీలో పాల్గొననున్న రెండు గ్రూపులు:
Group A
Ireland, Netherlands , Papua New Guinea (PNG), United Arab Emirates (UAE), West Indies
Group B
Afghanistan, Hong Kong, Nepal, Zimbabwe, Scotland
వేదికలు:
Queens Sports Club, Bulawayo
Bulawayo Athletic Club, Bulawayo
Harare Sports Club, Harare
Old Hararians Sports Club, Harare
Kwekwe Sports Club, Kwekwe
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications