
ఇటీవల టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మపై వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తన అద్భుతమైన వ్యూహాలతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడని కొనియాడుతూనే రాబోయే రోజుల్లో కెప్టెన్‌గా కఠినమైన సవాళ్లను ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడని అన్నాడు. అయితే కెప్టెన్‌గా రోహిత్ ఏడాది మొత్తం చాలా క్రికెట్ ఆడాల్సి ఉంటుందని, ఇదే అతనికి పెద్ద సవాల్‌గా మారనుందని దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. రోహిత్ చాలా తెలివైనవాడని, అతను అత్యుత్తమమైన కెప్టెన్ అనడంతో ఎలాంటి సందేహం లేదని అన్నాడు. అతడు మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణించగలడన్నాడు.
మైదానంలో తన వ్యూహాలతో రోహిత్ శర్మ మ్యాచ్ ఫలితాన్నే మార్చేయగలడని దినేష్ కార్తీక్ అన్నాడు. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన మూడో టీ20 మ్యాచే దీనికి నిదర్శనమని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో కెప్టెన్‌గా రోహిత్ ఏం చేశాడో మనం చూసామని అన్నాడు. బౌలర్లను రోటేట్ చేస్తూ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడని, దీంతో విండీస్ లక్ష్యాన్ని చేధించలేకపోయిందని చెప్పాడు. కాగా ఆ మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే రోహిత్ శర్మకు ఇప్పటికే 34 ఏళ్లు పూర్తి అయ్యాయని దినేష్ కార్తీక్ గుర్తు చేశాడు. అతను ఇంకా ఎంత కాలం క్రికెట్ ఆడతాడనేది ప్రశ్నగా మిగిలిందని ఈ సీనియర్ వికెట్ కీపర్ అంటున్నాడు. ఒక రకంగా అన్ని ఫార్మాట్లకు రోహిత్‌శర్మను కెప్టెన్‌గా నియమించడాన్ని దినేష్ కార్తీక్ వ్యతిరేకిస్తున్నాడని చెప్పుకోవాలి.
రోహిత్ శర్మను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమించాడంపై ఒక్క దినేశ్ కార్తీక్ మాత్రమే కాదు పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రోహిత్‌కు ఉన్న వయసు దృష్యా అతను ఎక్కువ కాలం క్రికెట్ ఆడలేడని అభిప్రాయపడుతున్నారు. దీంతో కొంత కాలానికి మళ్లీ కెప్టెన్‌ను వెతుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే బీసీసీఐకి మాత్రం మరోదారి లేదనే చెప్పుకోవాలి. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. రిషబ్ పంత్‌కు ఇంకా అనుభవం లేదు. మిగతా వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోహిత్ శర్మనే అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడంతో బీసీసీఐ అతనికే పూర్తిగా కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.